Gautam Gambhir: గౌతమ్‌ గంభీర్‌కు బెదిరింపులు.. వారంలో మూడోసారి!

మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చినట్లు గౌతమ్‌ గంభీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 29 Nov 2021 04:16 IST

దర్యాప్తు ముమ్మరం చేసిన దిల్లీ పోలీసులు

దిల్లీ: మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చినట్లు గౌతమ్‌ గంభీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్‌లోని సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఇక గంభీర్‌ ప్రాణాలకు హాని తలపెడతామంటూ బెదిరింపు రావడం గడిచిన ఆరు రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం.

‘ఈ కేసుకు సంబంధించి మీ దిల్లీ పోలీసులు, ఐపీఎస్‌ శ్వేతా (డీసీపీ) ఏమీ సాధించలేరు. పోలీసుల్లోనూ మా గూఢచారులు ఉన్నారు. మీ గురించి సమాచారమంతా మాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది’ అని ఐసిస్‌కశ్మీర్‌ పేరుతో ఉన్న ఈ-మెయిల్‌ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ధ్రువీకరించిన దిల్లీ పోలీసులు.. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు.

గంభీర్‌తోపాటు ఆయన కుటుంబానికి ప్రాణహాని తలపెడతామంటూ గత మంగళవారం తొలిసారిగా ఆయనకు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. అనంతరం బుధవారం రోజున గంభీర్‌ ఇంటి వీడియో జతచేసిన మరో మెయిల్‌ వచ్చింది. ఐఎస్‌ఐఎస్‌కశ్మీర్‌ పేరుతో వస్తోన్న ఈ-మెయిల్‌ బెదిరింపులపై ఇప్పటికే గౌతమ్‌ గంభీర్‌ వ్యక్తిగత కార్యదర్శి గౌరవ్‌ అరోరా దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి మూలాలు పాక్‌లో ఉన్నట్లు అనుమానిస్తోన్న పోలీసులు.. ముందస్తుగా గంభీర్‌ ఇంటివద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఈ-మెయిల్‌కు సంబంధించి ఖాతాదారు వివరాలు, ఐపీ అడ్రస్‌ వంటి పూర్తి సమాచారం కోసం దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఇప్పటికే గూగుల్‌ను సంప్రదించింది. గూగుల్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఈ-మెయిళ్లను పాక్‌ నుంచి ఓ కాలేజీ విద్యార్థి వీటిని పంపినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని