
Coal Shortage: బొగ్గు సంక్షోభంపై.. వర్షాల పిడుగు
బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు
దిల్లీ: దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడవచ్చనే ఆందోళన ఎక్కువైంది. బొగ్గు లభ్యత, సరఫరా పెంచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తడంతో బొగ్గు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మరికొన్ని రోజులు బొగ్గు సరఫరా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
దేశంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు డిమాండుకు సరిపడా బొగ్గు సరఫరా లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. బొగ్గు గనులు మూతపడడం, వర్షాల కారణంగా ఈ సమస్య ఎదురవుతున్నట్లు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఈ సమస్య అధిగమిస్తామని భరోసా వ్యక్తం చేసింది. మరోవైపు కొత్త గనుల్లో తవ్వకాలు ప్రారంభం, క్యాప్టీవ్ మైన్స్ నుంచి బొగ్గు సరఫరా చేయడం వంటి చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో బొగ్గు ఉత్పత్తి అధికంగా ఉన్న పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్న ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తికి మరోసారి ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం ఏర్పడినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా నిత్యం 20లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని.. రుతుపవనాల ప్రభావం తగ్గుతున్నందున రానున్న రోజుల్లో బొగ్గు లభ్యత మరింత పెరుగుతుందని ఈమధ్యే స్పష్టం చేసింది. ఇదే సమయంలో మరోసారి వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.