Costs of the Afghan War: అఫ్గాన్‌ యుద్ధం ఖర్చు, ప్రాణ నష్టం ఎంతంటే..!

అఫ్గాన్‌ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టం వేల సంఖ్యలో ఉండగా.. యుద్ధం కోసం అమెరికా చేసిన ఖర్చు చూస్తే కళ్లు తిరిగిలే ఉన్నాయి.

Published : 17 Aug 2021 15:36 IST

కొన్ని తరాల అమెరికన్లపై యుద్ధభారం

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో అమెరికా చేసిన యుద్ధం తాలిబన్ల హస్తగతంతో ముగిసింది. అయితే, ఇలా గడిచిన రెండు దశాబ్దాలుగా అఫ్గాన్‌లో కొనసాగిన యుద్ధం అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ పోరుగా నిలిచిపోయింది. కానీ, ఈ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టం వేల సంఖ్యలో ఉండగా.. యుద్ధం కోసం చేసిన ఖర్చు చూస్తే కళ్లు తిరిగిలే ఉన్నాయి. గడిచిన 20ఏళ్లుగా అఫ్గాన్‌ యుద్ధం కోసం అమెరికా దాదాపు 2లక్షల కోట్ల డాలర్లుకుపైగా ఖర్చుచేసినట్లు అంచనా. రోజువారీగా చూస్తే.. నిత్యం దాదాపు 300మిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ భారాన్ని రానున్న కొన్ని తరాల అమెరికన్‌లు మోయాల్సి వస్తుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా చరిత్రలో సుదీర్ఘ యుద్ధం..

ఇరవై ఏళ్ల సుదీర్ఘకాలం పాటు అఫ్గాన్‌లో యుద్ధం కొనసాగించిన అమెరికా, చివరకు ఈ ఏడాది ఆగస్టు 31నాటికి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఆ గడువు కన్నా నెలముందే ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేసింది. 2003 నుంచి 2011 మధ్యకాలంలో అఫ్గాన్‌తో పాటే ఇరాక్‌తోనూ ఒకే సమయంలో అమెరికా యుద్ధం కొనసాగించింది. ఈ రెండు యుద్ధాల్లో వేల మంది అమెరికా సేనలు పాల్గొనాల్సి వచ్చింది. ఇలా సుదీర్ఘకాలం పాటు జరిగిన అఫ్గాన్‌ యుద్ధం కోసం అమెరికా లక్షల కోట్ల డాలర్లను వెచ్చించడమే కాకుండా వేల మంది సైనికుల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. 11 సెప్టెంబర్‌ 2001 అల్‌-ఖైదా జరిపిన దాడి తర్వాత ఈ యుద్ధాలపై అమెరికా పెట్టిన ఖర్చు, ప్రాణ నష్టంపై హార్వర్డ్‌ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్‌తో పాటు బ్రౌన్‌ యూనివర్సిటీ వేసిన అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.

భారీ ప్రాణ నష్టం..

* అఫ్గాన్‌లో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికుల సంఖ్య : 2448

* అమెరికాకు చెందిన తాత్కాలిక సిబ్బంది : 3846

* అఫ్గాన్‌ సైన్యం, పోలీసులు : 66,000

* నాటో దేశాల బలగాలతో పాటు ఇతర అనుబంధ సైన్యం : 1144

* అఫ్గాన్‌లో సాధారణ పౌరులు : 47,245

* తాలిబన్లతో పాటు ఇతర ప్రత్యర్థి బలగాలు : 51,191

* సహాయక సిబ్బంది - 444, జర్నలిస్టులు - 72 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

భరించలేని ఆర్థిక భారం..

కొరియన్‌ యుద్ధం జరిగిన సందర్భంలో వాటికి అయ్యే ఖర్చుల కోసం అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ పన్నులను తాత్కాలికంగా 92శాతానికి పెంచారు. వియత్నాం యుద్ధం సమయంలోనూ అప్పటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ పన్నులను 77శాతం పెంచారు. కానీ, అఫ్గాన్‌, ఇరాక్‌ యుద్ధాలు ప్రారంభమైన తొలినాళ్లలో అధ్యక్షుడిగా ఉన్న జార్జ్‌ డబ్ల్యూ వాషింగ్టన్‌ మాత్రం సంపన్నులపై పన్నుల భారం మోపకుండా దాదాపు 8శాతం తగ్గించడం గమనార్హం. అయితే, ఇలా అఫ్గాన్‌, ఇరాక్‌లపై జరిపిన యుద్ధాల కోసం అమెరికా భారీ స్థాయిలో అప్పులు చేయాల్సి వచ్చింది. 2020 నాటికి దాదాపు 2లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. కేవలం అఫ్గాన్‌ సైన్యానికి శిక్షణ, అధునాతన ఆయుధాల కోసమే అమెరికా దాదాపు 89 బిలియన్‌ డాలర్లను ఖర్చుచేసింది. ఇలా యుద్ధంపై చేసిన మొత్తం ఖర్చు 2050 నాటికి వడ్డీతో కలిపి దాదాపు 6.5లక్షల కోట్ల డాలర్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

యుద్ధం ముగిసినా.. తగ్గని ఖర్చు..

అఫ్గాన్‌, ఇరాక్‌లపై అమెరికా చేసిన యుద్ధం ముగిసినప్పటికీ ఆయా దేశాల్లో మాజీ సైనికులు, సీనియర్‌ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా ఇదివరకే వెల్లడించింది. లక్షల మందికి సహాయం చేసేందుకు మరింత ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా యుద్ధాలపై అమెరికా చేసిన ఖర్చు.. కొన్ని తరాల అమెరికన్లపై ఉంటుందని భావిస్తున్నారు. 2050 నాటికి ప్రతి అమెరికా పౌరుడిపై దాదాపు 20వేల డాలర్ల భారం పడనుందని అంచనా. అంతేకాకుండా ఈ మొత్తం ఖర్చు అమెరికాలో ఉన్న జెఫ్‌ బెజోస్‌, ఎలాన్‌ మస్క్‌, బిల్‌ గేట్స్‌ వంటి 30మంది కుబేరుల ఆస్తుల విలువ కంటే ఎక్కువ కావడం గమనార్హం.

సాధించిన పురోగతి..

అమెరికా సేనలు అఫ్గాన్‌లో అడుగుపెట్టడంతో పాటు ఇతర అనుబంధ సేనలు వచ్చిన తర్వాత తాలిబన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాయి. అనంతరం అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. ఇలా 2 దశాబ్దాల తర్వాత ప్రస్తుతం అక్కడ పరిస్థితులను గమనిస్తే కొంత పురోగతి కనిపిస్తుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా అఫ్గాన్‌లో శిశు మరణాల రేటు భారీగా తగ్గింది. మహిళలు, బాలికలు ఇంటికే పరిమితం కావాలన్న భావన సగానికి తగ్గింది. ప్రస్తుతం అక్కడి యువతుల్లో దాదాపు 37శాతం మంది చదవగలిగే సామర్థ్యాన్ని పొందగలిగారు. కానీ, ప్రస్తుతం అఫ్గాన్‌ను తిరిగి తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో రెండు దశాబ్దాల్లో జరిగిన కనీస పురోగతి కూడా ప్రశ్నార్థకంగా మారినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని