Japan: జపాన్​ ప్రధానిగా మరోసారి ఎన్నికైన కిషిదా

జపాన్‌ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిడా (64) మళ్లీ ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఓటింగ్​లో.. కిషిడా ప్రధాని పదవి చేపట్టేందుకు పార్లమెంట్​ సభ్యులు ఆమోదం తెలిపారు.....

Published : 10 Nov 2021 22:22 IST

టోక్యో: జపాన్‌ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిదా (64) మళ్లీ ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఓటింగ్​లో.. ఆయన ప్రధాని పదవి చేపట్టేందుకు పార్లమెంట్​ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సభ్యులతో కేబినెట్​ను ఏర్పాటు చేయనున్నారు. అయితే నెల రోజుల క్రితమే ప్రధానిగా ఎన్నికైన కిషిడా.. పార్లమెంట్ దిగువసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కిషిదా ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ.. 465 మంది సభ్యులు గల పార్లమెంట్‌ దిగువ సభలో 261 సీట్లు సాధించింది. ఈ ఫలితంతో కిషిదా పూర్తిస్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగింది.

కిషిదా గతంలో జపాన్‌ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. జపాన్‌కు సుదీర్ఘ కాలంపాటు ప్రధానమంత్రిగా పనిచేసిన షింజో అబే అనారోగ్య కారణాలతో గతేడాది ఆగస్టు నెలలో తన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. అనంతరం ఆ బాధ్యతలను స్వీకరించిన 72ఏళ్ల యోషిహిడే సుగా ఏడాది గడవకముందే పదవి నుంచి తప్పుకున్నారు. మరోసారి ఈ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అధికార లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ నిర్వహించిన సంస్థాగత ఎన్నికల్లో ఫుమియో కిషిదాకు భారీ మద్దతు లభించింది. ప్రధాని పదవి చేపట్టాక దిగువసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన ఫుమియో కిషిదా పూర్తి మెజార్టీతో విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని మళ్లీ దక్కించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని