Marburg Virus: ఈ వైరస్ ఎక్కడ వెలుగుచూసిందో తెలుసా..?

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న వేళ.. రకరకాల వైరస్‌ల గురించి వార్తలు వస్తున్నాయి.

Published : 11 Aug 2021 01:50 IST

ఈ వైరస్ కేసును ధ్రువీకరించిన ఆరోగ్య సంస్థ

జెనీవా: కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న వేళ.. రకరకాల వైరస్‌ల గురించి వార్తలు వస్తున్నాయి. తాజాగా మార్‌బర్గ్ అంటూ పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో మరో వైరస్ రకం వెలుగులోకి వచ్చింది. ఇది ఎబోలాకు సంబంధించిన ప్రాణాంతక వైరస్‌. అలాగే కొవిడ్-19 వలే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. ఇటీవల మరణించిన వ్యక్తి నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది. గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్‌తో మరణాలు రేటు 88 శాతంగా ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడించారు.

‘వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న మార్‌బర్గ్‌ను వెంటనే నిలువరించాలి’ అని ఆరోగ్య సంస్థకు చెందిన ఆఫ్రికా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మొయిటీ హెచ్చరించారు. దాంతో స్థానికంగా, దేశీయంగా అత్యంత ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఎబోలాను కట్టడి చేయడంలో గినియాకున్న అనుభవాన్ని.. తాము ఉపయోగించుకోనున్నట్లు మొయిటీ వెల్లడించారు. అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు అక్కడికి చేరుకున్నారు. 

గబ్బిలాలకు ఆవాసంగా ఉండే గుహలు, గనుల వద్ద సంచారంతో ఇది మనుషుల సోకే అవకాశం ఉంది. ఒకసారి మనిషికి సోకితే వేగంగా వ్యాప్తి చెందుతుంది. శరీర స్రావాల ద్వారా ఇతరులకు అంటుకుంటుంది. అలాగే ఉపరితలాలు, వస్తువులను నుంచి ఇతరులకు సోకుతుందని ఆరోగ్య సంస్థ తెలిపింది. తాజాగా గినియాలో వెలుగుచూసిన ఈ మార్‌బర్గ్ కేసు అటవీ ప్రాంతంలోని ఒక వ్యక్తిలో వెలుగుచూసింది. ఆ ప్రాంతం లైబీరియా, సియెర్రా లియోన్‌కు సమీపంలో ఉంటుంది. అసలు ఆ వ్యక్తి జులై 25నే అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడే లక్షణాలు కనిపించాయి. స్థానికంగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోస్టు మార్టం రిపోర్టుల్లో ఎబోలా నెగిటివ్‌గా, మార్‌బర్గ్ పాజిటివ్‌గా తేలింది. గతంలో దక్షిణాఫ్రికా ప్రాంతంలో అంగోలా, కెన్యా, ఉగాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాల్లో ఈ వైరస్ వెలుగుచూసింది. కానీ పశ్చిమాఫ్రికాలో గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి. 

ఈ వైరస్ బారినవారిలో ఒక్కసారిగా తీవ్రంగా జ్వరం, తలనొప్పి, అసౌకర్యం కలుగుతుంది. 24 నుంచి 88 శాతం మంది మృతి చెందే అవకాశమూ ఉంది. అయితే ఆ రేటు వైరస్ రకం, వైద్య సేవలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు ఆమోదం పొందిన టీకాలు, చికిత్సలు అందుబాటులో లేవు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని