
Liquor Shops: మద్యం దుకాణాలు నా నియంత్రణలో లేవు!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో ఉండే మద్యం దుకాణాలు తొలగింపు అంశం తన నియంత్రణలో లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మద్యం దుకాణాల తొలగింపు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించదని.. అది కేవలం రాష్ట్రాలకు చెందిన అంశమని రాజ్యసభలో వెల్లడించారు. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మాత్రమే కేంద్ర రోడ్డు రవాణా శాఖ జోక్యం చేసుకుంటుందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం, తొలగింపులపై ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండేలా స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రాలకు సూచించారు. అంతేకాకుండా మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 185 ప్రకారం, తాగి వాహనం నడిపితే జరిమానా, శిక్ష ఉంటాయని గుర్తు చేశారు.
4.49లక్షల ప్రమాదాలు.. 1.51లక్షల మరణాలు
దేశవ్యాప్తంగా 2019 సంవత్సరంలో మొత్తం 4లక్షల 49వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆ ప్రమాదాల్లో మొత్తం 1,51,113 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నితిన్ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. అంతకుముందు ఏడాది (2018)తో పోలిస్తే ప్రమాదాలు, మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గాయని చెప్పారు. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌రూట్‌లో వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు వాడడం వల్లే ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు.