Covid-19 : అంతవరకూ ఎవరూ సురక్షితం కాదు!

దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్‌ చీఫ్‌ డా.రణ్‌దీప్‌ గులేరియా మరోసారి గుర్తు చేశారు.

Published : 01 Aug 2021 17:07 IST

ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా

దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్‌ చీఫ్‌ డా.రణ్‌దీప్‌ గులేరియా మరోసారి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను పాటించాలని కోరారు. అలాగే సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

‘దేశంలో మహమ్మారి ఇంకా ముగియలేదు. సూపర్‌ స్ప్రెడర్లుగా మారే కార్యక్రమాలను నియంత్రించాలి. ఇలాంటి కార్యక్రమాల ప్రభావం సాధారణంగా మూడు వారాల తర్వాత కనిపిస్తుంది. అందుకే అత్యవసరం కాని ప్రయాణాలపై మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మహమ్మారిని ఎదుర్కోవాలంటే.. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందే’ అని గులేరియా వెల్లడించారు.

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో బూస్టర్‌ డోసులపై కూడా ఆయన స్పందించారు. బూస్టర్‌ డోసుల అవసరంపై ఇంకా తగినంత ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

‘చాలా మంది ఇంకా మొదటి డోసే పొందనప్పుడు.. బూస్టర్‌ డోసుల గురించి మాట్లాడటం సరైంది కాదు. ప్రపంచంలో అందరూ సురక్షితంగా ఉండే వరకూ.. వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ సురక్షితంగా లేరనే భావించాలి. ఒక ప్రాంతంలో కొత్త వేరియంట్‌ వెలుగులోకి వస్తే.. అది ఇతర దేశాలకూ వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్‌ వేగవంతంగా జరగాల్సిన అవసరం ఉంది ’ అని గులేరియా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని.. మహమ్మారి నుంచి బయటపడేందుకు ఇదొక్కటే మార్గమని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని