Packaged diet: ప్యాకేజ్డ్‌ ఆహారంలో చక్కెర తగ్గిస్తే.. హృద్రోగాలు, పక్షవాతం దూరం

పొట్లాల్లో ఉంచే ఆహారంలో 20%, సీసాల్లో నిల్వచేసే పానీయాల్లో 40% మేర చక్కెరను తగ్గిస్తే..

Published : 09 Sep 2021 14:56 IST

హార్వర్డ్‌ అధ్యయనం

వాషింగ్టన్‌: పొట్లాల్లో ఉంచే ఆహారంలో 20%, సీసాల్లో నిల్వచేసే పానీయాల్లో 40% మేర చక్కెరను తగ్గిస్తే.. హృద్రోగ, పక్షవాత బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందట! ఒక్క అమెరికాలోనే 24.8 లక్షల మందికి హృద్రోగ సమస్యలు తప్పుతాయని, 7.50 లక్షల మంది మధుమేహం నుంచి తప్పించుకుంటారని తేలింది. యూఎస్‌ నేషనల్‌ సాల్ట్‌ అండ్‌ షుగర్‌ రిడక్షన్‌ ఇనిషియేటివ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఆర్‌ఐ) విభాగం.. ఫిబ్రవరిలో చక్కెర తగ్గింపు ప్రతిపాదన చేసింది. 15 రకాల ఆహార పదార్థాలు, పానీయాల్లో తీపి తగ్గించాలని సూచించింది. చక్కెర రహిత పదార్థాల తయారీకి ప్రాధాన్యమివ్వాలని, ఒక్క వ్యక్తికి సరిపడేంత పరిమాణంలోనే ప్యాకెట్లను తయారు చేయాలని పేర్కొంది. వీటిని అమలుచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపై హార్వర్డ్‌ పరిశోధకులు, మసాచూసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు అధ్యయనం సాగించారు. ‘‘ఎన్‌ఎస్‌ఎస్‌ఆర్‌ఐ ప్రతిపాదనలను కఠినంగా అమలు చేయాలి. ఇందుకు షుగర్‌ పన్ను విధించాలి. చక్కెర కలిపినట్టు లేబుళ్లపై పేర్కొనాలి. పాఠశాలల వద్ద తీపి పానీయాలను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలి’’ అని అధ్యయనకర్తలు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని