SC: నేరస్థులు రాజకీయాల్లోకి రాకుండా చేయలేమా..?

నేరచరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రాకుండా, ఎన్నికల్లో నిలబడకుండా శాసనవ్యవస్థ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోందని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Published : 20 Jul 2021 22:56 IST

శాసనవ్యవస్థ ఏమీ చేయలేకపోతోందన్న సుప్రీం కోర్టు

దిల్లీ: నేరచరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రాకుండా, ఎన్నికల్లో నిలబడకుండా శాసనవ్యవస్థ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోందని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను రాజకీయ పార్టీలు పాటించడం లేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ నారీమన్‌, జస్టిస్‌ గవాయ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. ఇక వివిధ రాష్ట్రాల ఎన్నికల సమయంలో జాతీయ పార్టీలు ఈసీ నిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల గుర్తులపై చర్యలు (నిలిపివేసే) తీసుకునే సాధ్యాసాధ్యాలు ఏంటి అని అమికస్‌ క్యూరీగా ఉన్న కేవీ విశ్వానాథన్‌ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం అడిగింది.

ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల నేరచరిత్రకు సంబంధించిన సమాచారాన్ని రాజకీయ పార్టీలు వారి వెబ్‌సైట్లలో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలని 2020, ఫిబ్రవరి 13వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ 2020లో జరిగిన బిహార్‌ ఎన్నికల్లో అక్కడి రాజకీయ పార్టీలు సుప్రీం ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంలో.. అసలు ఇటువంటి నేర చరిత్ర ఉన్నవారిలో ఎన్నికల్లో నిలబడకుండా శాసనవ్యవస్థ ఏమీ చేయలేకపోతోందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, అభ్యర్థుల నేరచరిత్రకు సంబంధించి అఫిడవిట్‌ దాఖలు చేయడం, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడంలో విఫలమయ్యామని కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, బీఎస్‌పీతో పాటు సీపీఎం పార్టీలు అంగీకరించాయి. ఎన్నికల కమిషన్‌తో పాటు న్యాయస్థానం ఆదేశాలను పాటించనందుకు సుప్రీంకోర్టుకు  ఆయా పార్టీలు బేషరతు క్షమాపణలు చెప్పాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని