Third Wave: భారత్‌లో.. థర్డ్‌వేవ్‌ మొదలైనట్లే..!

గత వారం రోజులుగా కొవిడ్‌ కోసుల్లో భారీ పెరుగుదలను చూస్తుంటే దేశంలో మహమ్మారి మూడోవేవ్‌ను సూచిస్తోందని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా పేర్కొన్నారు.

Published : 05 Jan 2022 01:57 IST

కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా

దిల్లీ: గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో బయటపడుతోన్న పాజిటివ్‌ కేసులను విశ్లేషిస్తే వాటిలో ఎక్కువగా కొత్తవేరియంట్‌ ఒమిక్రాన్‌వే ఉంటున్నాయి. ఇలా గత వారం రోజులుగా కొవిడ్‌ కోసుల్లో భారీ పెరుగుదలను చూస్తుంటే దేశంలో మహమ్మారి మూడోవేవ్‌ను సూచిస్తోందని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా పేర్కొన్నారు. అనేక దేశాల్లో ఇదే తరహాలో విజృంభణ మొదలైందన్న ఆయన.. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలకు విస్తరించిన విషయాన్ని గుర్తుచేశారు.

‘దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు వాటి సమీప ప్రాంతాల్లో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇలా క్రమంగా కొవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం థర్డ్‌వేవ్‌కు సూచికమే. అయినప్పటికీ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో 80శాతం మంది సహజంగానే వైరస్‌కు గురయ్యారు. దీనికితోడు 90శాతం మంది అర్హులు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 65శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందింది’ అని డాక్టర్‌ అరోఢా స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికా మాదిరిగానే..

దక్షిణాఫ్రికాలో విస్తృత వేగంతో వ్యాపిస్తూ విజృంభించిన ఒమిక్రాన్‌ వేవ్‌ను పరిశీలిస్తే.. రెండు వారాల తర్వాత కేసుల్లో తగ్గుదల కనిపించింది. అందులోనూ ఎక్కువగా లక్షణాలు లేని, స్వల్ప అనారోగ్యం, ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా తక్కువగానే కనిపించింది. ఈ అంశాలన్నీ దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉద్ధృతి త్వరలోనే తగ్గుముఖం పడుతుందని సూచిస్తున్నాయి. సాంక్రమిక వ్యాధుల విషయంలో దక్షిణాఫ్రికా, భారత్‌ మధ్య కాస్త సారూప్యతలు ఉన్నాయి. ఇరు దేశాల్లోనూ సహజ ఇన్‌ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉంది. అయినప్పటికీ వ్యాక్సిన్‌ విషయంలో మాత్రం భారత్‌లో భారీ స్థాయిలో పంపిణీ జరిగింది’ అని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా గుర్తుచేశారు.

త్వరలోనే గరిష్ఠానికి..

దక్షిణాఫ్రికా తరహాలోనే భారత్‌లో మూడోవేవ్‌ ఉద్ధృతి ఉండవచ్చని డాక్టర్‌ అరోఢా అంచనా వేశారు. భారత్‌లో గత పదిరోజుల్లో ఇన్‌ఫెక్షన్‌ ప్రవర్తనను చూస్తుంటే త్వరలోనే థర్డ్‌వేవ్‌ గరిష్ఠానికి చేరుకుంటుందని భావిస్తున్నానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయినప్పటికీ భయపడాల్సి అవసరం లేదని ఉద్ఘాటించిన ఆయన.. వ్యాధి తీవ్రత, ఆస్పత్రి బారినపడకుండా రక్షణ పొందాలంటే పూర్తి మోతాదులో (రెండో డోసు) వ్యాక్సిన్‌ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు. వీటితోపాటు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటికే 23రాష్ట్రాలకు వ్యాపించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. ఇప్పటివరకు 1892 మందిలో బయటపడింది. మహారాష్ట్రలో అత్యధికంగా 568 రికార్డుకాగా, దిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్‌ 152, తమిళనాడు 121 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 37,379 కేసులు నమోదుకాగా దేశంలో కొవిడ్‌ క్రియాశీల కేసుల సంఖ్య లక్షా 72వేలకు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని