Marriage Age: అమ్మాయిల వివాహ బిల్లు పరిశీలన బృందంలో ఒకే ఒక్క మహిళా ఎంపీ!

యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం తీసుకువచ్చిన బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలో ఒకే ఒక్క మహిళకు స్థానం లభించింది.....

Published : 02 Jan 2022 19:40 IST

దిల్లీ: యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ.. కేంద్రం తీసుకువచ్చిన బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలో ఒకే ఒక్క మహిళకు స్థానం లభించింది. 31 మంది సభ్యులతో పార్లమెంటరీ ప్యానెల్ ఏర్పాటుకాగా.. అందులో తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)కి చెందిన ఎంపీ సుస్మితా దేవ్‌కు మాత్రమే చోటు దక్కింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బాల్యవివాహాల నిరోధక సవరణ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఈ బిల్లును విద్య, మహిళలు, చిన్నారులు, క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని సభ నిర్ణయించింది.

రాజ్యసభ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. భాజపా సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ బిల్లును పరిశీలించనుంది. మొత్తం 31 మందితో కూడిన కమిటీలో ఒకేఒక్క మహిళకు స్థానం దక్కడంపై మహిళా ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్యానెల్‌లో మహిళా ఎంపీల సంఖ్య పెరిగితే బాగుంటుందని ఎంపీలు సుస్మితా దేవ్, సుప్రియా సూలే అభిప్రాయపడ్డారు. పురుషులు, మహిళలు అంటూ ఎదురవుతున్న వివక్షను తొలగిస్తూ.. ఏకరూపత తీసుకొచ్చేలా యువతుల కనీస పెళ్లి వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం పెంచనున్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని