US: అమెరికాలో మారిన ఐసొలేషన్, క్వారంటైన్​​ లెక్కలు.. కారణమిదే!

ఐసొలేషన్​, క్వారంటైన్​ నిబంధనల్లో అమెరికా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం (సీడీసీ) కీలక మార్పులు చేసింది. వీటి గడువును తగ్గించింది......

Published : 28 Dec 2021 23:25 IST

వాషింగ్టన్‌: దేశంలో కొవిడ్‌ ఇతర వేరియంట్లు సహా తాజా ఒమిక్రాన్‌ విజృంభిస్తున్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికా ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఐసొలేషన్​, క్వారంటైన్​ నిబంధనల్లో అమెరికా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం (సీడీసీ) కీలక మార్పులు చేసింది. వీటి గడువును తగ్గించింది. కొవిడ్‌​ నిర్ధరణకు ముందు రెండు రోజులు, తర్వాత మూడు రోజుల్లోనే వ్యాధి తీవ్రత అధికంగా ఉంటోందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్​ తీవ్రత తక్కువగానే ఉన్నా.. వ్యాప్తి వేగంగా ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలో ఆరోగ్య వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఉండేందుకు సీడీసీ ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల ఐసొలేషన్​ సమయాన్ని ఇప్పటికే కుదించారు. గతంలో ఉన్న నిబంధనలకన్నా తక్కువ రోజుల్లోనే కొవిడ్​ సోకిన వారు విధుల్లో చేరుతున్నారు.

తాజా నిబంధనల ప్రకారం.. కొవిడ్​ పాజిటివ్​ తేలిన వ్యక్తి 5 రోజుల పాటు ఐసొలేషన్​లో ఉండాలి. గతంలో ఇది 10 రోజులుగా ఉండేది. 5 రోజుల తర్వాత లక్షణాలు ఇంకా ఉంటే ఇంట్లోనే ఉండాలి. కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారు క్వారంటైన్‌లో ఉండాల్సిన కాలాన్ని కూడా తగ్గించారు. ఐదు రోజులపాటు ఉంటే చాలని వెల్లడించారు. కొవిడ్ బాధితుల్లో లక్షణాలు బయటపడక ముందు రెండు రోజులు, బయటపడ్డాక 3 రోజుల్లోనే వారి నుంచి ఇతరులకు వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు నిబంధనలు సడలించినట్లు తెలిపారు. అయితే కొవిడ్‌ సోకినవారి ఐసోలేషన్ సమయం ముగిశాక మరో 5 రోజుల పాటు ఇతరులతో కలిసేటప్పుడు తప్పనిసరిగా మాస్క్  ధరించాలని అధికారులు సూచించారు.

10 రోజుల క్వారంటైన్​, ఐసొలేషన్​ కాలాన్ని 5 రోజులకు కుదించడం రిస్క్​తో కూడిన వ్యవహారమే. దీనిపై న్యూయార్క్​కు చెందిన వైద్యనిపుణుడు​ డా. ఆరోన్​ గ్లాట్ మాట్లాడారు. ‘బాధితుల నుంచి వైరస్​ వ్యాప్తి చెందే అవకాశం 5 రోజుల తర్వాత తగ్గుతుంది. కానీ పూర్తిగా మాయమైపోదు. బాధితుడు ఎక్కడికి వెళ్లినా వైరస్​ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే మాస్కులు కచ్చితంగా ధరించాలి’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని