Evusheld : యాంటీబాడీ కాక్‌టెయిల్‌తో ఒమిక్రాన్‌కు ముకుతాడు..!

ఆస్ట్రాజెనెకా రూపొందించిన ఎవూషెల్డ్‌ (Evusheld) యాంటీబాడీ కాక్‌టెయిల్‌ చికిత్స కొత్త వేరియంట్లను నిరోధించడంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

Published : 18 Dec 2021 01:04 IST

మెరుగైన ఫలితాలు వచ్చాయన్న ఆస్ట్రాజెనెకా

న్యూయార్క్‌: కొవిడ్‌-19ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ చికిత్స కోసం ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలురకాల ఔషధ మిశ్రమాల పనితీరుపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆస్ట్రాజెనెకా రూపొందించిన ఎవూషెల్డ్‌ (Evusheld) యాంటీబాడీ కాక్‌టెయిల్‌ చికిత్స కొత్త వేరియంట్లను నిరోధించడంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కొవిడ్‌ ముప్పు ఎక్కువగా ఉన్నవారికి వినియోగించేందుకు ఇప్పటికే అనుమతి పొందిన ఈ కాక్‌టెయిల్‌ ఔషధం.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తటస్థీకరించడంలో క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది.

కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సమర్థ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు ఆస్ట్రాజెనెకా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా కొవిడ్‌-19ను దీర్ఘకాలం నిరోధించే విధంగా రెండు (టిక్సాగేవిమాబ్, సిల్‌గావిమాబ్‌) మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాంబినేషన్‌లో రూపొందించిన ఎవూషెల్డ్‌పై అధ్యయనం చేపట్టింది. అమెరికా ఆహార, ఔషధ సంస్థ (FDA)తో పాటు సెంటర్‌ ఫర్‌ బయోలాజిక్స్‌ ఎవల్యూషన్‌ రీసెర్చ్‌ నిపుణులు వేర్వేరుగా చేపట్టిన అధ్యయనంలో ఒమిక్రాన్‌ను తటస్థీకరించడంలో ఈ యాంటీబాడీ చికిత్స మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలింది. అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చిన ఈ పరిశోధనలో.. ఒమిక్రాన్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.

‘ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కూడా తటస్థీకరించే శక్తి ఎవూషెల్డ్‌కు ఉన్నట్లు తాజా అధ్యయనం ద్వారా తెలుస్తోంది. వేర్వేరు రూపాల్లో వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యమున్న రెండు యాంటీబాడీ ఔషధాలను కలిపి దీన్ని రూపొందించాం. సార్స్‌-కోవ్‌-2 వల్ల కొత్తగా ఉద్భవించే వేరియంట్లను సమర్థంగా నిరోధించే సామర్థ్యం కూడా దీనికి ఉంది’ అని ఆస్ట్రాజెనెకా పరిశోధనాభివృద్ధి విభాగాధిపతి మేన్‌ పాంగలోస్‌ పేర్కొన్నారు.  వీటికి సంబంధించి పరిశోధనల సమాచారం విశ్లేషణ కొనసాగుతోందని.. తాజాగా వెల్లడైన ప్రాథమిక ఫలితాలు ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ చికిత్స విస్తృత వినియోగానికి మరింత దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని