
అజిత్ ఢోబాల్ ఇంటిపై ఉగ్రవాదుల రెక్కీ
దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కి నిర్వహించినట్లు పోలీసుల కస్టడీలో ఉన్న ఓ ఉగ్రవాది బయటపెట్టాడు. దీంతో ఢోబాల్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన హిదాయత్ ఉల్లా మాలిక్ అనే ఉగ్రవాదిని ఈ నెల 6న జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే దర్యాప్తులో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆదేశాల మేరకు 2019 మే నెలలో దిల్లీలోని సర్దార్ పటేల్ భవన్, ఢోబాల్ నివాసంతో పాటు ప్రముఖులు ఉండే పలు ప్రాంతాల్లో తాను రెక్కీ నిర్వహించానని మాలిక్ వెల్లడించినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో పాటు సాంబా సరిహద్దుల్లోనూ తాను రెక్కీ చేపట్టానని, తనతో పాటు మరికొందరు ఉగ్రవాదులు కూడా ఈ ఆపరేషన్‌లో ఉన్నట్లు మాలిక్ వెల్లడించినట్టు తెలుస్తోంది.
మాలిక్ సమాచారంతో అప్రమత్తమైన కశ్మీర్ పోలీసులు దిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఢోబాల్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కశ్మీర్ భద్రతా వ్యవహారాల్లో కీలకంగా ఉండే ఢోబాల్ ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు గతంలో నిఘా సంస్థలు కూడా హెచ్చరించాయి. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులకు ఢోబాల్ వ్యూహకర్తగా వ్యవహరించారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.