Corona:ఈ జిల్లాల్లోనే కేసులు పెరుగుతున్నాయ్‌..! 

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నా.. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా ....

Published : 05 May 2021 19:37 IST

దిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నా.. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా  ఈ వైరస్‌ ఉద్ధృతి  మాత్రం ఆగడంలేదు. సెకండ్‌ వేవ్‌లో భారీగా మరణాలు నమోదవుతుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, గత రెండు వారాలుగా దేశంలోని 12 జిల్లాల్లో కరోనా కేసుల పెరుగుదల భారీగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏడు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూసినట్టు అధికారులు తెలిపారు. వీటిలో కర్ణాటకలోని బెంగళూరు అర్బన్‌ జిల్లా టాప్‌లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై(తమిళనాడు), కొలికోడ్‌ (కేరళ), ఎర్నాకుళం (కేరళ), గురుగ్రామ్‌ (హరియాణా); త్రిస్సూర్ (కేరళ)‌, మలప్పురం (కేరళ), పట్నా (బిహార్‌), కొట్టాయం (కేరళ), మైసూరు (కర్ణాటక), చిత్తూరు (ఏపీ), దేహరాదూన్‌ (ఉత్తరాఖండ్‌), సతారా (మహారాష్ట్ర), అలప్పుళ (కేరళ), సోలాపూర్‌ (మహారాష్ట్ర) జిల్లాలు ఉన్నట్టు (రెండు వారాలతో పోలుస్తూ) ప్రత్యేక గ్రాఫ్‌లను విడుదల చేశారు. మరోవైపు, ఇంతకుముందు భారీగా కొత్త కేసులు నమోదైన మహారాష్ట్రలోని  11 జిల్లాల్లో వైరస్‌ తగ్గుముఖం పట్టినట్టు నమోదైందని అధికారులు తెలిపారు. పుణె, ఠానే, ముంబయి, లాతూరు, ఔరంగాబాద్‌, ముంబయి సబర్బన్‌, నాందేడ్‌ తదితర జిల్లాల్లో గత రెండు వారాలుగా కేసులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 15శాతంగా ఉన్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని