Nirmala Sitharaman: పాకిస్థాన్‌ కంటే మా దేశంలోనే వారు బాగున్నారు..: నిర్మలా సీతారామన్‌

భారత్‌లో ముస్లింలపై దాడులు జరిగేది నిజమైతే.. వారి జనాభా నానాటికీ ఎలా పెరుగుతుందని నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రశ్నించారు. భారత్‌లో మైనార్టీలపై హింస జరుగుతోందంటూ పశ్చిమ దేశాల్లో వస్తున్న వార్తలకు ఆమె గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 11 Apr 2023 13:25 IST

వాషింగ్టన్‌: భారత్‌ (India)లో ముస్లిం మైనార్టీ (Muslim Minorities)లపై హింస జరుగుతోందంటూ పశ్చిమ దేశాల్లో వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న రెండో దేశం భారత్‌ అని ఆమె తెలిపారు. ఇస్లామిక్‌ దేశమైన పాకిస్థాన్‌ (Pakistan) కంటే భారత్‌లోనే ముస్లిం ప్రజల జీవనం మెరుగ్గా ఉందన్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman).. వాషింగ్టన్‌లో పీటర్సన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎకానమిక్స్‌లో జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌లో ముస్లిం మైనార్టీలపై హింస, ప్రతిపక్ష ఎంపీలపై అనర్హత వంటి అంశాలపై పలువురు ఆమెను ప్రశ్నించారు. దీనికి సీతారామాన్‌ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్‌. వారి సంఖ్య పెరుగుతోంది కూడా. వారి జీవితాలు కష్టంగా ఉంటే.. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 1947 నాటి కంటే వారి జనాభా ఇంత పెరగగలదా?ఆనాడు ఇస్లామిక్‌ దేశంగా ఏర్పడిన పాకిస్థాన్‌లో ప్రస్తుతం మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ వారి సంఖ్య నానాటికీ పడిపోతోంది. కానీ, మా దేశంలో ఆ పరిస్థితి లేదు. మా దగ్గర శాంతి భద్రతలనేది దేశం మొత్తానికి సంబంధించిన అంశం. భారత్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాస్తవ పరిస్తితులు ఏమాత్రం తెలుసుకోకుండా ఇలా దేశాన్ని నిందించడం సరికాదు’’ అని ఆమె మండిపడ్డారు.

భారత్‌లో ఉన్న ముస్లింలు.. పాకిస్థాన్‌ (Pakistan) ప్రజల కంటే మెరుగ్గా జీవిస్తున్నారని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు రాసిన వారు భారత్‌కు రావాలని నిర్మలమ్మ ఆహ్వానించారు. దేశమంతా ఒంటరిగా తిరిగి తమ ఆరోపణలను రుజువు చేయాలని సవాల్‌ విసిరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని