Long Covid: 70శాతం బాధితుల్లో ఆ రెండు లక్షణాలే అధికం..!

‘లాంగ్‌ కొవిడ్‌’గా పరిగణించే ఇటువంటి కేసుల్లో.. బాధితులను రెండు లక్షణాలు ప్రధానంగా వేధిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

Updated : 26 Mar 2022 02:20 IST

లాంగ్‌కొవిడ్‌ సమస్యలపై తాజా అధ్యయనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉన్నప్పటికీ అది సృష్టించిన విలయంతో ప్రపంచ దేశాలు కోలుకోలేకపోతున్నాయి. ఇదే సమయంలో కొన్ని దేశాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైరస్‌ విస్తృతిపై అలసత్వం వహించకూడదని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. మరోవైపు కొవిడ్‌ సోకిన బాధితులు త్వరగానే కోలుకుంటున్నప్పటికీ మరికొందరిలో సుదీర్ఘకాలం పాటు కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ‘లాంగ్‌ కొవిడ్‌’గా పరిగణించే ఇటువంటి కేసుల్లో.. బాధితులను రెండు లక్షణాలు ప్రధానంగా వేధిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా లాంగ్‌ కొవిడ్‌తో బాధపడుతున్న వారిలో జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం సర్వసాధారణంగా కనిపిస్తున్నాయని తేలింది.

కొవిడ్‌-19 ప్రారంభమైనప్పటి నుంచి కోలుకున్న తర్వాత కూడా బాధితులను పలు లక్షణాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం, అలసట, శ్వాసకోశ ఇబ్బందులను కూడా దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాల జాబితాలోకి చేరిపోయాయి. ఇదే సమయంలో లాంగ్‌ కొవిడ్‌ మరిన్ని ప్రభావాలను తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు ఇటీవల మరో అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా లాంగ్‌ కొవిడ్‌ బాధితుల్లో ఎక్కువగా మెమొరీ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం అనే రెండు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి పది మంది బాధితుల్లో ఏడుగురు (దాదాపు 70శాతం) ఇటువంటి న్యూరలాజికల్‌ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా ఈ లక్షణాలు శాశ్వతంగా లేదా ఏడాది వరకూ ఉంటున్నట్లు కేంబ్రిడ్జ్‌ నిపుణులు వెల్లడించారు. వీటితోపాటు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, ఛాతి నొప్పి, దగ్గు, నిద్రలేమి, ఆత్రుత, ఒళ్లు జలదరించటంతో పాటు అలసట వంటి సమస్యలు దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాలుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత బాధితులను నెలలపాటు కొన్ని లక్షణాలు వేధిస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకిన తర్వాత 6 నుంచి 12 నెలల వరకు కొవిడ్‌ లక్షణాలు కనిపించాయని డెన్మార్క్‌ స్టేట్‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ జరిపిన అధ్యయనంలో పాల్గొన్న 53శాతం మంది బాధితులు పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్‌ నుంచి కోలుకున్న కొన్ని నెలల తర్వాత కొత్త కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని బీఎంజే జర్నల్ కూడా వెల్లడించింది. ఇలా కొవిడ్‌ కారణంగా పలు ఆరోగ్య సమస్యలు సుదీర్ఘ కాలంపాటు వేధిస్తున్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తూనే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని