
ఐపీఎస్ అధికారిణికి లైంగిక వేధింపులు..
ప్రభుత్వంపై మండిపడ్డ డీఎంకే నేత స్టాలిన్..
చెన్నై: ఓ పోలీసు ఉన్నతాధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా ఐపీఎస్ అధికారి ఆరోపించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే పళనిస్వామి హాజరైన ఓ సమావేశ కార్యక్రమంలోనే ఈ ఘటన జరగడం అందరి దృష్టికి చేరింది. మహిళా ఐపీఎస్ అధికారి ఫిర్యాదుతో అప్రమత్తమైన రాష్ట్ర హోంశాఖ ఆరుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందాన్ని నియమించింది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నసమయంలోనే ఈ ఘటన వెలుగులోకి రావడం రాజకీయ విమర్శలకు తెరలేపింది. దీంతో డీఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై బుధవారం తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇది ఒక విచారకరమైన విషయం.. పోలీసుల అహంకారానికి ప్రతీక.. ఇటువంటి పోలీసు అధికారులు ఉన్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి అని విమర్శించారు. మహిళా పోలీసు అధికారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా’అని అన్నారు.
అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు ఉన్నతాధికారి వీటిపై ఇప్పటి వరకు స్పందించలేదు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరికి రావడంతో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, పోలీసు అధికారిని రాష్ట్రంలో ప్రధాని మోదీ సందర్శన ఏర్పాట్ల బాధ్యతలకు దూరంగా ఉంచినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.