Coronavirus: కొత్త వేరియంట్‌ కలవరం వేళ.. చుక్కల మందు టీకాకు కేంద్రం ఆమోదం

కరోనా మహమ్మారి విజృంభణ ధాటికి ప్రస్తుతం చైనా విలవిల్లాడుతోంది. మునుపెన్నడూ లేనంతగా అక్కడ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 

Updated : 23 Dec 2022 12:35 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు(Covid-19) పెరుగుతోన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి కేంద్రం అన్ని చర్యలు చేపడుతోంది. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదేశాలు అందాయి. ఈ క్రమంలోనే దేశీయ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాసికా టీకా(Two-drop nasal vaccine)కు ఆమోదం తెలిపినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి టీకా అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనే లభ్యం కానుంది. అయితే, ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు తీసుకున్నవారు ఈ నాసికా టీకాను హెటిరోలాగస్‌ బూస్టర్‌(Heterologous booster)గా తీసుకోవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందు టీకా ‘ఇన్‌కొవాక్‌’ను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) నవంబర్‌లో అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనికి కేంద్రం ఆమోదం లభించగా.. శుక్రవారం సాయంత్రం నుంచి కొవిన్‌ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి రానుంది. మనదేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వినియోగించేందుకు వీలుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 

కొత్త మార్గదర్శకాల దిశగా కేంద్రం..

ప్రపంచ దేశాల్లో కేసులు భారీగా వెలుగుచూస్తుండడంతో క్రిస్మస్, కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్నారు. ‘మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు. ఈ పండగ సీజన్‌లో అందరు కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడం ఆవశ్యకం. చైనా, కొరియా, బ్రెజిల్‌ నుంచి ప్రారంభమైన కొవిడ్‌.. దక్షిణాసియాకు వ్యాపించింది. 20 నుంచి 35 రోజుల్లో భారత్‌కు వచ్చింది. తాజా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతోన్న 81.2 శాతం కొత్త కేసులు కేవలం పది దేశాల్లోనే వెలుగుచూస్తున్నాయని, ఈ జాబితాలో జపాన్‌ ముందువరుసలో ఉందని తెలిపింది. ప్రస్తుతం చైనాలో ఆర్‌ ఫ్యాక్టర్ 16గా ఉందని పేర్కొంది. అలాగే చైనాలో కనిపిస్తోన్న ఉద్ధృతికి గల కారణాలను ప్రస్తావించింది. మెరుగైన సామర్థ్యంలేని టీకాలు, తక్కువస్థాయి వ్యాక్సినేషన్‌, జీరో కొవిడ్ వ్యూహం వల్ల సంబంధిత నిరోధకత లభించకపోవడం, ఒక్కసారిగా ఎత్తివేసిన ఆంక్షలు అక్కడి పరిస్థితి కారణమని అధ్యయనాలను ఉటంకించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని