PM Modi: మారువేషాల్లో అర్బన్‌ నక్సల్స్‌ వస్తున్నారు : మోదీ

రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అర్బన్‌ నక్సల్స్‌ వేషం మార్చుకొని మరోసారి ప్రయత్నిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 10 Oct 2022 18:17 IST

గాంధీనగర్‌: రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అర్బన్‌ నక్సల్స్‌ (Urban Naxals) వేషం మార్చుకొని మరోసారి ప్రయత్నిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హెచ్చరించారు. యువత జీవితాలను నాశనం చేసే అటువంటి వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రం అనుమతించదని ఉద్ఘాటించారు. గుజరాత్‌ భారుచ్‌ జిల్లాలో ఔషధాల పార్క్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు.

‘కొత్త రూపాల్లో అర్బన్‌ నక్సల్స్‌ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు వేషాన్ని మార్చుకున్నారు. అమాయక యువతను తప్పుదోవపట్టిస్తూ తమవైపు తిప్పుకుంటున్నారు. మన యువతను నాశనం చేసే అటువంటి వారిని సహించేది లేదు. అర్బన్‌ నక్సల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని మన పిల్లలకు స్పష్టం చేయాలి. వారు విదేశీ శక్తులకు ఏజెంట్లు. వారికి గుజరాత్‌ తలవంచదు. అటువంటి వారిని గుజరాత్‌ నాశనం చేస్తుంది’ అంటూ ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఇక 2014లో తాను మొదటగా ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ పదో స్థానంలో ఉందని.. ప్రస్తుతం ఐదో స్థానానికి చేరుకున్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు.

ఇటీవల జరిగిన రాష్ట్రాల పర్యావరణశాఖ మంత్రుల సదస్సులోనూ కొందరు పర్యావరణ ఉద్యమకారులపై ప్రధాని మోదీ మండిపడ్డ సంగతి తెలిసిందే. వారిని అభివృద్ధి నిరోధకులుగా పేర్కొన్న ఆయన.. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని అర్బన్‌ నక్సల్స్‌ అడ్డుకొన్నారని ఆరోపించారు. ప్రాజెక్టు కారణంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందంటూ ఉద్యమాలు చేశారని.. దాని ఫలితంగా ప్రాజెక్టు ఆలస్యం కావడంతో భారీగా నిధులు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని