Delta Plus: టీకా ఒక్కటే సరిపోదు..!

డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌తో పాటు మాస్కులు ధరించడం వంటి కరోనా కట్టడి చర్యలను తప్పకుండా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

Published : 27 Jun 2021 15:16 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు

జెనీవా: కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సమయంలో కొత్తగా వెలుగు చూసిన డెల్టాప్లస్‌ వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌తో పాటు మాస్కులు ధరించడం వంటి కరోనా కట్టడి చర్యలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను ఆందోళనకర రకంగా WHO పేర్కొన్న విషయం తెలిసిందే.

డెల్టా రకాన్ని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌ ఒక్కటే సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా ప్రతినిధి మోలీటా వునోవిక్‌ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ + మాస్కులు తప్పనిసరి పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ వల్ల వైరస్‌ వ్యాప్తిని కొంతవరకు తగ్గించడంతో పాటు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం నుంచి బయటపడవచ్చని అన్నారు. అయినప్పటికీ అదనపు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని.. స్వల్ప కాలంలో ఈ చర్యలు చేపట్టకపోతే మరోసారి లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

11 దేశాలకు విస్తరించిన డెల్టా ప్లస్‌..

డెల్టా రకం వైరస్‌ను ఆందోళనకర రకంగా (వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమధ్యే ప్రకటించింది. ఇప్పటికే ఈ రకం 11దేశాలకు వ్యాపించగా.. దాదాపు 200లకుపైగా కేసులు నమోదైనట్లు సమాచారం. అమెరికా, భారత్‌తోపాటు బ్రిటన్‌, పోర్చుగల్‌లో ఈ కేసులు సంఖ్య అధికంగా ఉంది. ఇప్పటికే  డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను పలు దేశాలు ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చాలా దేశాల్లో కరోనా వైరస్‌ మరోసారి విజృంభణకు ఈ వేరియంట్‌ ప్రభావం ఉండనుందని WHO హెచ్చరించింది. అయితే, ఈ వేరియంట్ ప్రభావాన్ని అంచనా వేయడంపై దృష్టి సారించిన నిపుణులు.. వ్యాక్సిన్‌తో పాటు మాస్కులు వంటి కొవిడ్‌ కట్టడి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని