Vande mataram: ‘వందేమాతరం’, ‘జనగణమన’కు సమాన హోదా.. స్పష్టం చేసిన కేంద్రం

‘జనగణమన’, ‘వందేమాతరం’కు సమాన హోదా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ప్రజలంతా ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని వెల్లడించింది.

Updated : 05 Nov 2022 17:38 IST

దిల్లీ: జాతీయ గీతం ‘జనగణమన’కు, ‘వందేమాతరం’ గేయానికి సమాన హోదా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. జాతీయ గీతం ‘జనగణమన'కి సమానమైన హోదాను ‘వందేమాతరం’ గేయానికి కూడా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం తాజాగా స్పందించింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది.

జనగణమనకి, వందేమాతరానికి సమాన గౌరవం, హోదా కల్పించేలా మార్గదర్శకాలను రూపొందించేలా.. తగిన ఆదేశాలు ఇవ్వాలని దిల్లీ హైకోర్టులో కొద్దిరోజుల క్రితం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని పిటిషనర్, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వందేమాతరానికి కూడా జనగణమనతో సమానమైన గౌరవం ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రతిరోజూ వందేమాతరం, జనగణమన పాడేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని అశ్విని ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు. కాగా విచారణలో భాగంగా.. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని కేంద్ర హోం, విద్యా, సాంస్కృతిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు దిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై కేంద్రం తాజాగా స్పందిస్తూ.. ఆ రెండింటికి సమాన హోదా ఉంటుందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని