WHO అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం!

ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ లైసెన్స్‌ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

Published : 15 Jan 2021 03:19 IST

అత్యవసర వినియోగ లైసెన్స్‌పై సీరం ఇన్‌స్టిట్యూట్‌

ముంబయి: ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ లైసెన్స్‌ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఇప్పటికే అందుకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని అందించామని, వచ్చే ఒకటి, రెండు వారాల్లోనే అనుమతి రానున్నట్లు సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా వెల్లడించారు. ఇదివరకే ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అనుమతి ద్వారా నియంత్రణ సంస్థల అనుమతులు లేకుండానే ఆయా దేశాల్లో వ్యాక్సిన్‌లను నేరుగా వినియోగించే వీలుంటుంది.

భారీ స్థాయిలో నోవావాక్స్‌..
అమెరికాకు చెందిన నోవావాక్స్‌ సంస్థ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లోనూ భారీ స్థాయిలో నిల్వ చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి నెలకు దాదాపు 4 నుంచి 5కోట్ల డోసులను నిల్వ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపింది. ఇక నోవావాక్స్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను‌ తయారీ చేసేందుకు ఆ సంస్థతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం, ప్రతిఏటా 200కోట్ల నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ డోసులను భారత్‌లో ఉత్పత్తి చేయనుంది.

భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ కంపెనీల్లో ఒకటనే విషయం తెలిసిందే. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు అంతర్జాతీయ సంస్థలు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మాత్రం భారత్‌లో చేసేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రముఖ సీరం ఇన్‌స్టిట్యూట్‌తో పాటు భారతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకాను తయారు చేస్తోండగా, నోవావాక్స్‌, కొడాజెనెక్స్‌ వంటి సంస్థల వ్యాక్సిన్‌లను కూడా ఇక్కడే ఉత్పత్తి చేయనుంది.

250కోట్ల డోసుల ఉత్పత్తి..

సీరం ఉత్పత్తి చేస్తోన్న ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌) వ్యాక్సిన్‌ ప్రతి మూడు నెలలకొకసారి కొత్త వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని సీరం సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో పంపిణీ కార్యక్రమం నడుస్తోందని, జనవరి చివరి నాటికి విదేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం దాదాపు 100కోట్ల డోసులను సరఫరా చేస్తామని అదర్‌ పూనావాలా పునరుద్ఘాటించారు. ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 150కోట్ల డోసులు ఉండగా, ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 250కోట్ల డోసులకు పెంచుతామని అన్నారు. ఇదిలాఉంటే, జనవరి 16నుంచి ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 1.1కోట్ల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను కేంద్ర ప్రభుత్వం సేకరించింది.

ఇవీ చదవండి..
తొలిరోజు..3లక్షల మందికి టీకా
8నెలల్లో..చైనాలో తొలి కరోనా మరణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని