Kejriwal: సిసోదియాను అరెస్టు చేశారు సరే.. నోట్ల గుట్టలు దొరికిన ఎమ్మెల్యే సంగతేంటి?

అవినీతి కేసులో నిందితుడిగా అజ్ఞాతంలో ఉన్న కర్ణాటక భాజపా ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. దీంతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal)‌.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Published : 07 Mar 2023 17:29 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Excise Scam Case) కేసులో మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) అరెస్టు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal)‌.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూటి ప్రశ్న వేశారు. కర్ణాటక (Karnataka)లో భాజపా ఎమ్మెల్యే కుమారుడి ‘లంచావతరం’ ఘటనను ఉదహరిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏమీ లేని సిసోదియాపై అన్ని కేసులు పెట్టినప్పుడు.. నోట్ల గుట్టలు దొరికిన భాజపా ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదేం? అని ప్రశ్నించారు.

‘‘ప్రధానమంత్రి (PM Modi) జీ.. మనీశ్ సిసోదియా నివాసంలో సోదాలు జరిపినప్పుడు అధికారులకు ఏం లభించలేదు. అయినా సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)లోని అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టి ఆయనను అరెస్టు చేశారు. అదే మీ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేస్తే పెద్ద మొత్తంలో నగదు బయటపడింది. అయినా ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదు? ఇంకెప్పుడూ అవినీతిపై పోరాటం గురించి మాట్లాడకండి. ఆ మాటలు మీకు సరిపోవు’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

కర్ణాటకలోని చెన్నగిరి ఎమ్మెల్యే, భాజపా (BJP) నేత మాడాళ్‌ విరూపాక్షప్ప (Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్‌ మాడాళ్‌ ఇటీవల రూ.40లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. దీంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేపట్టగా.. రూ.8కోట్లకు పైగా అక్రమ నగదు బయటపడింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎమ్మెల్యే విరాపాక్షప్పపైనా కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని