Lockdown: ఆ పరిస్థితి వస్తేనే ముంబయిలో లాక్‌డౌన్‌.. మేయర్‌ వెల్లడి

రోజువారీ కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతుండటంతో.. దిల్లీ, ముంబయి తదితర మెట్రో నగరాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. దిల్లీలో ఈ వారాంతం నుంచి వీకెండ్‌ కర్ఫ్యూ విధించనున్నట్లు ఆప్‌ ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసింది. ఇదే క్రమంలో...

Updated : 04 Jan 2022 19:48 IST

ముంబయి: రోజువారీ కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతుండటంతో.. దిల్లీ, ముంబయి తదితర మెట్రో నగరాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. దిల్లీలో ఈ వారాంతం నుంచి వీకెండ్‌ కర్ఫ్యూ విధించనున్నట్లు ఆప్‌ ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసింది. ఇదే క్రమంలో.. ముంబయిలోనూ రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటితే లాక్‌డౌన్‌ విధిస్తామని మేయర్ కిశోరి పెడ్నేకర్ మంగళవారం వెల్లడించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. ముంబయిలో సోమవారం 8,082 కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 18 తర్వాత అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య ఇదే. దీంతోపాటు కొత్తగా 40 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. అయితే, వీరిలో 90 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు.. కొవిడ్‌ కారణంగా ముంబయిలోని ఆసుపత్రుల్లో చేరికలూ గత నాలుగు రోజుల్లో 15 శాతానికి పెరిగినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 574 మంది దవాఖానాల్లో చేరారు. బృహన్‌ముంబయి మున్సిపాలిటీ(బీఎంసీ) వివరాల ప్రకారం.. నగరంలోని 30,565 కొవిడ్ పడకల్లో 12.2 శాతం, 2,720 ఐసీయూ బెడ్‌లలో 14 శాతం నిండిపోయాయి. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగే జంబో కేంద్రాలు పడకలను సమకూర్చుకునే పనిలో పడ్డాయి. ఇదిలా ఉండగా.. వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో నగరంలో ఒకటి నుంచి తొమ్మిది, 11 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను జనవరి 31 వరకు నిలిపేయాలని బీఎంసీ నిర్ణయించింది. అపార్ట్‌మెంట్లు, గృహ సముదాయాల్లో 20 శాతం కంటే ఎక్కువ నివాసాల్లో కేసులు బయటపడితే.. మొత్తంగా ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని