Sidhu Moose Wala: సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం.. తెరపైకి మరో గ్యాంగ్‌స్టర్‌

ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో పంజాబ్‌లో మరోసారి ముఠాకక్షలు తెరపైకి వచ్చాయి. సిద్ధూ హత్య తన పనేనని గోల్డీ బ్రార్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన విషయం తెలిసిందే. కాగా..

Updated : 01 Jun 2022 11:06 IST

చండీగఢ్‌: ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో పంజాబ్‌లో మరోసారి ముఠాకక్షలు తెరపైకి వచ్చాయి. సిద్ధూ హత్య తన పనేనని గోల్డీ బ్రార్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన విషయం తెలిసిందే. కాగా.. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ తాజాగా మరో గ్యాంగ్‌స్టర్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడం కలకలం రేపుతోంది.

గ్యాంగ్‌స్టర్‌ నీరజ్‌ బావ్నాకు సంబంధించిన ఓ సోషల్‌మీడియా ఖాతాలో నిన్న ఓ పోస్ట్‌ కన్పించింది. ‘‘సిద్ధూ నా సోదరుడి లాంటివాడు. అతడి హత్యకు రెండు రోజుల్లో బదులు చెబుతాం’’ అని హెచ్చరిస్తూ ఆ పోస్ట్‌ పెట్టారు. అయితే ఈ పోస్ట్‌ను ఎవరు పెట్టారన్నది స్పష్టత లేదు. పలు హత్యలు, దోపిడీ కేసులను ఎదుర్కొంటున్న నీరజ్‌ ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నాడు. దిల్లీ, హరియాణా, పంజాబ్‌, రాజస్థాన్‌లో అతడికి అనుచరులున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం నీరజ్‌ బావ్నా ముఠా సభ్యుడైన భుప్పీ రానా ఫేస్‌బుక్‌ ఖాతాలోనూ ఇలాంటి హెచ్చరికలే కన్పించడం గమనార్హం. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

సిద్ధూ హత్య గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా పనే అని పోలీసులు అనుమానిస్తోన్న విషయం తెలిసిందే. సిద్ధూ హత్య తామే చేశామంటూ బిష్ణోయ్‌ సన్నిహితుడు, ముఠా సభ్యుడైన గోల్డీ బ్రార్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. బిష్ణోయ్‌ సన్నిహితుడు విక్కీ మిద్దుఖేడా గతేడాది మొహాలీలో హత్యకు గురయ్యాడు. అందులో సిద్ధూ మేనేజర్‌ శగన్‌ప్రీత్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో శగన్‌ప్రీత్‌ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. విక్కీ హత్యకు ప్రతీకారంగానే బిష్ణోయ్‌ ముఠా ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బిష్ణోయ్‌ కూడా ప్రస్తుతం తిహాడ్‌ జైల్లోనే ఉన్నాడు. దీంతో హత్యకు అక్కడి నుంచే పథకం రచించి ఉంటారని భావిస్తున్నారు. హత్యలో పాల్గొన్న ఓ నిందితుడికి తిహాడ్‌ జైలు నుంచి ఫోన్‌ కాల్‌ రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది.

ఈ క్రమంలోనే లారెన్స్‌ బిష్ణోయ్‌ను దిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సిద్ధు హత్య నేపథ్యంలో తనను ఎన్‌కౌంటర్‌ చేసి చంపేస్తారని బిష్ణోయ్‌ ఆరోపించాడు. తనకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో జైల్లో అతడికి భద్రతను పెంచినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని