ముద్దుగుమ్మల పెళ్లి దుస్తులు.. ధరెంతో తెలుసా?

పెళ్లంటే జీవితంలో వచ్చే అరుదైన వేడుక. ఆ రోజు ఎంతో అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కలకంటుంది. ఆ ఒక్కరోజు కోసం స్థోమతను బట్టి ఖర్చు

Published : 21 Sep 2020 09:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: పెళ్లంటే జీవితంలో వచ్చే అరుదైన వేడుక. ఆ రోజు ఎంతో అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కలకంటుంది. ఆ ఒక్కరోజు కోసం స్థోమతను బట్టి ఖర్చు చేస్తుంటారు. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి వివాహ తంతు కోసం కుటుంబ సభ్యులేకాకుండా.. కోట్లాది అభిమానులు సైతం ఎదురుచూస్తుంటారు. మరి ఆ రోజు అందరికీ నచ్చేలా తళుక్కుమనాలి కదా.. అందుకే ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా దుస్తులు, నగలు తయారు చేయించుకుంటుంటారు. అలా ఇప్పటికే చాలా మంది నటీమణులు అత్యంత ఖరీదైన దుస్తుల్లో మెరిశారు. ఐశ్వర్యరాయ్‌, అనుష్క శర్మ, సమంత, జెనీలియా.. ఇలా ప్రముఖులు ధరించిన దుస్తులు, వాటి ధరలు ఓ సారి చూద్దాం..

ఐశ్వర్యరాయ్‌

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌- అభిషేక్‌ బచ్చన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 2007 ఏప్రిల్‌ 20న అత్యంత వేడుకగా వీరి పెళ్లితంతు జరిగింది. ఈ ప్రత్యేక రోజు కోసం ఐశ్వర్య బంగారు వర్ణం కాంజీవరం చీరను ఎంచుకున్నారు. ప్రముఖ డిజైనర్‌ నీతా లుల్లా దీన్ని డిజైన్‌ చేశారు. క్రిస్టల్‌, గోల్డ్‌ పోగుల్ని కలిపి చీరను రూపొందించారు. అప్పట్లో దీని విలువ దాదాపు రూ.75 లక్షలట.

అనుష్క శర్మ

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, కథానాయిక అనుష్క శర్మ పెళ్లి వేడుక 2017 డిసెంబరు 11న ఇటలీలో జరిగింది. ఈ సందర్భంగా అనుష్క గులాబీ రంగు లెహెంగాతోపాటు అందమైన జ్యువెలరీ ధరించారు. ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి రూపొందించిన ఈ లెహెంగా ధర రూ.30 లక్షలట. విరాట్‌ కూడా సవ్యసాచి డిజైన్‌ చేసిన షేర్వానీలో మెరిశారు.

శిల్పాశెట్టి

‘సాగరకన్య’గా తెలుగు వారికి కూడా దగ్గరైన శిల్పా శెట్టి పెళ్లి రోజున అన్‌కట్‌ డైమండ్స్‌, ఎరుపు రంగు వర్క్‌ చీరలో అందంగా కనిపించారు. చీరను ప్రముఖ డిజైనర్‌ తరుణ్‌ తాహిలియాని రూపొందించారు. దాదాపు 8వేల క్రిస్టల్స్‌ను చీరలో కూర్చారట. కేవలం చీర కోసం శిల్పా శెట్టి రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు బాలీవుడ్‌ టాక్‌. ఆమె వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను 2009 నవంబరు 22న వివాహం చేసుకున్నారు.

కరీనా కపూర్‌

టౌడీ నవాబ్‌, కథానాయకుడు సైఫ్‌ అలీ ఖాన్‌ను 2012 అక్టోబరు 16న ప్రేమ వివాహం చేసుకున్నారు కరీనా కపూర్‌. పెళ్లి రోజున ఆమె తన తల్లి గాగ్రాను ధరించారు. రిసెప్షన్‌కు మాత్రం ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా రూపొందించిన లెహెంగా ధరించారు. దాని ధర రూ.50 లక్షలట.

జెనీలియా

క్షిణాదిలో వరుస హిట్లు అందుకున్న జెనీలియా నటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌ రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నారు. 2012 ఫిబ్రవరి 3న వీరి పెళ్లి జరిగింది. ఆ సందర్భంగా జెనీలియా.. నీతూ లుల్లా రూపొందించిన మహారాష్ట్ర స్టైల్‌ చీరలో అందంగా కనిపించారు. కేవలం ఈ చీర కోసం ఆమె రూ.17 లక్షలు ఖర్చు చేశారట.

దీపికా పదుకొణె

చాలా ఏళ్ల ప్రేమ తర్వాత దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2018 నవంబరు 14న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా దీపిక సవ్యసాచి డిజైన్‌ చేసిన ఎరుపు వర్ణం లెహెంగాను ధరించారు. దీని ధర దాదాపు రూ.9 లక్షల పైమాటే!

ప్రియాంకా చోప్రా

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ప్రియాంకా చోప్రా అమెరికాకు చెందిన గాయకుడు నిక్‌ జొనాస్‌ను రాజస్థాన్‌ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. 2018 డిసెంబరు 1న జరిగిన ఈ శుభకార్యంలో ఆమె సవ్యసాచి రూపొందించిన ఎరుపు వర్ణం లెహెంగాలో తళుక్కుమన్నారు. దాని ధర రూ.18 లక్షలని సమాచారం.

సోనమ్‌ కపూర్‌

టుడు అనిల్‌ కపూర్‌ కుమార్తెగా తెరకు పరిచయమైనా.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు సోనమ్‌ కపూర్‌. ఆమె 2018 మే 8న వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాను మనువాడారు. అనుకోకుండా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో వివాహం జరిగింది. కాగా పెళ్లిలో సోనమ్‌ ఎరుపు రంగు లెహెంగాతోపాటు ఖరీదైన ఆభరణాలు ధరించారు. కేవలం ఆమె లెహెంగా ధర రూ.70 లక్షలట.

అసిన్‌

‘గజిని’, ‘శివమణి’.. తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అసిన్‌. ఆమె మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మను 2016 జనవరి 19న వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సవ్యసాచి డిజైన్‌ చేసిన క్రీమ్‌ కలర్‌ లెహెంగాలో ఆకట్టుకున్నారు. దీని ధర రూ.7 లక్షల కంటే ఎక్కువని సమాచారం.

ఊర్మిళ

బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలోనూ గుర్తింపు పొందిన తార ఊర్మిళ. ఆమె తన పెళ్లి రోజున మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన లెహంగా ధరించారు. దాని విలువ రూ.4.50 లక్షలట. 2016 మార్చి 3న ఆమె మొహ్సిన్‌ అఖ్తర్‌ మిర్‌ను వివాహం చేసుకున్నారు.

బిపాసా బసు

టి బిపాసా బసు నటుడు కరణ్‌ జోహార్‌ గ్రోవర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 2016 ఏప్రిల్‌ 30న వీరి వివాహం జరిగింది. ఆ రోజున బిపాసా ఎరుపు, బంగారు వర్ణం కలగలిపిన లెహెంగా, జైపూర్‌ జ్యువెలరీలో మెరిశారు. లెహెంగాను ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి రూపొందించారు. దీని ధర రూ.4 లక్షలట.

 

సమంత

గ్ర కథానాయిక సమంత అక్కినేని వారి కోడలు కాబోతోందని తెలిసిన తర్వాత అభిమానులు ఎంతో సంబరపడ్డారు. 2017 అక్టోబరు 7న సామ్‌, నాగచైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నిశ్చితార్థ వేడుక కోసం సామ్‌ తన జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్ని బొమ్మలుగా మార్చి, చీరపై డిజైన్‌ వేయించారు. ప్రముఖ డిజైనర్‌ క్రేషా బజాన్‌ దీన్ని రూపొందించారు. ఆ తర్వాత పెళ్లి రోజున కూడా సామ్‌ క్రేషా డిజైన్‌ చేసిన లెహెంగా ధరించారు. వీటి ధర రూ.లక్షల్లో ఉంటుంది. ముహూర్తానికి మాత్రం చైతన్య గ్రాండ్‌మదర్‌ చీరను సామ్‌ ధరించి, పెళ్లి కుమార్తెగా మెరిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని