Amitabh Bachchan: అమితాబ్‌ ఫరెవర్‌

తరాలు మారినా... ప్రేక్షకులను అలరించిన అగ్రకథానాయకుల సినిమాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. వారి రెట్రో చిత్రాలను అభిమానులకు అందిస్తుంది ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌.

Updated : 21 Nov 2023 09:28 IST

రాలు మారినా... ప్రేక్షకులను అలరించిన అగ్రకథానాయకుల సినిమాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. వారి రెట్రో చిత్రాలను అభిమానులకు అందిస్తుంది ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌. గతేడాది భారతదేశమంతటా గొప్ప కథానాయకుల చిత్రాలను ప్రదర్శించారు. ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శివేంద్ర సింగ్‌ డూంగర్‌పుర్‌ ఆధ్వర్యంలో ‘బచ్చన్‌ బ్యాక్‌ టు ది బిగినింగ్‌’, ‘దిలీప్‌ కుమార్‌- హీరో ఆఫ్‌ హీరోస్‌’, ‘దేవానంద్‌జీ100- ఫరెవర్‌ యంగ్‌’ పేర్లతో అగ్రకథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌, దిలీప్‌ కుమార్‌, దేవానంద్‌ వారి విజయవంతమైన చిత్రాలను ప్రదర్శించారు. ఇప్పుడు తొలిసారిగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా మరోసారి  అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు శివేంద్ర సింగ్‌. ‘అమితాబ్‌ బచ్చన్‌, బిగ్‌ బి ఫరెవర్‌’ పేరుతో ఆ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. ఈ నెల 24 నుంచి డిసెంబరు 3 వరకు ఫ్రాన్స్‌లో జరిగే ప్రతిష్ఠాత్మమైన ‘ఫెస్టివల్‌ డెస్‌ 3 కాంటినెంట్స్‌’ 45వ ఎడిషన్‌ సందర్భంగా అమితాబ్‌ నటించిన విజయవంతమైన చిత్రాలలో బ్లాక్‌బస్టర్‌ అయిన ‘అభిమాన్‌’, ‘షోలే’, ‘దీవార్‌’, ‘కభీ కభీ’, ‘అమర్‌ అక్బర్‌ అంథోనీ’, ‘త్రిషూల్‌’, ‘డాన్‌’, ‘కాలా పత్తర్‌’ సినిమాలను ప్రేక్షకులకు అందించనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌కి ప్రాతినిధ్యం వహించడానికి తన కుమార్తె శ్వేత బచ్చన్‌ ఆ వేడుకలో పాల్గొననుంది. ఆ సందర్భంగా అమితాబ్‌ మాట్లాడుతూ...‘క్లాసిక్‌ చిత్రాలను తిరిగి ప్రదర్శించడానికి ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ తీసుకున్న నిర్ణయం నిజంగా గొప్ప విషయం. నేను నటించిన తొమ్మిది సినిమాలను ఆ వేడుకలో ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది. భిన్నమైన పాత్రలు చేస్తూ...హ్రిషికేష్‌ ముఖర్జీ, మన్‌మోహన్‌ దేశాయ్‌, యశ్‌ చోప్రా, రమేష్‌ సిప్పి లాంటి గొప్ప దర్శకనిర్మాతలతో పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయం’ అని అన్నారు. ‘ఇలాంటి విశిష్టమైన వేడుకలో మా నాన్న జీవితంలో మైలురాయిగా నిలిచిన సినిమాలను ప్రదర్శించడం  ఆనందంగా ఉంది. గతేడాది మా నాన్న 80వ పుట్టినరోజు సందర్భంగా ‘బచ్చన్‌ బ్యాక్‌ టు ది బిగినింగ్‌’ పేరుతో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ని జరిపారు. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయంగా జరపడం సంతోషంగా ఉంది. నటుడిగా మా నాన్న విశేషమైన బహుముఖ ప్రజ్ఞను చూసే అవకాశాన్ని కల్పిస్తుందీ వేడుక’ అంది శ్వేత. ‘చిత్రప్రదర్శనకు ఈ ఏడాది మరో అవకాశం కల్పించిన ఆర్టిస్టిక్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఫెస్టివల్‌ జెరోమ్‌ బారన్‌కి కృతజ్ఞతలు. వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన హీరో అమితాబ్‌ బచ్చన్‌’ అని తెలిపారు శివేంద్ర. జెరోమ్‌ బారన్‌ మాట్లాడుతూ...‘కొన్ని దశాబ్దాల కాలంగా సినీ జీవితాన్ని గడుపుతూ... ఐకానిక్‌గా నిలిచారు అమితాబ్‌. ఆ చిత్రాలతో పాటు ప్రముఖ దర్శకుడు సీడ్రిక్‌ డుపిరే తీసిన ‘ది రియల్‌ సూపర్‌స్టార్‌’ అనే డాంక్యుమెంటరీని కూడా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నాము’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు