AR Rahman: రెహమాన్‌ కాన్సర్ట్‌ వివాదం... పోలీసు అధికారులపై చర్యలు..

ఏ.ఆర్‌.రెహమాన్‌ (AR rahman) కాన్సర్ట్‌ వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన కారణంగా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు.

Updated : 13 Sep 2023 15:11 IST

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ (AR Rahman) ఇటీవల చెన్నై వేదికగా నిర్వహించిన ఓ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ తీవ్ర వివాదానికి తెర తీసిన విషయం తెలిసిందే. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా కాన్సర్ట్‌ ప్రాంగణంలో తొక్కిసలాట, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ తలెత్తడంతో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. తమతో కొంత మంది అనుచితంగా ప్రవర్తించారని ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో పలువురు ఫిర్యాదు చేశారు కూడా. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను ఆ రాష్ట్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు ప్రారంభించింది.

దిశా మిత్తల్‌, దీపా, ఆదర్శ్‌ అనే ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. అలాగే తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ మరో ఇద్దరు అధికారులను సైతం సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. కాన్సర్ట్‌ జరిగిన ప్రాంగణం వద్ద ఆయా అధికారులు సరిగ్గా విధులు నిర్వర్తించకపోవడం వల్లే ఇబ్బందులు పడ్డామంటూ పలువురు ఆరోపణలు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘సలార్‌’ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన టీమ్‌..

సెప్టెంబర్‌ 10వ తేదీన సాయంత్రం చెన్నైలోని ఆదిత్యరామ్‌ ప్యాలెస్‌ వేదికగా రెహమాన్‌ కాన్సర్ట్‌ జరిగింది. తమ అభిమాన సంగీత దర్శకుడి పాటలను లైవ్‌లో వినొచ్చని ఆనందంతో అక్కడికి వెళ్లినవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సీట్లు లేక, పార్కింగ్‌ సౌకర్యం సరిగ్గా లేక చాలా మంది అవస్థలు పడ్డారు. గోల్డ్‌ పాసులు ఉన్నప్పటికీ కొంతమందిని అనుమతించలేదు. దీంతో చాలామంది అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే పరిసర ప్రాంతాల్లో ట్రాపిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి. పలువురు నెటిజన్లు రెహమాన్‌, నిర్వాహకులను తిడుతూ నెట్టింట ఫిర్యాదులు చేశారు. ఈ విషయంపై రెహమాన్‌ క్షమాపణలు చెప్పారు. కాన్సర్ట్‌కు హాజరు కాలేకపోయిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని