puneeth rajkumar: పునీత్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌

గుండె పోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు,

Updated : 30 Oct 2021 18:30 IST

బెంగళూరు: గుండె పోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు బెంగళూరు చేరుకున్నారు. ఉదయం నుంచి ఎంతో మంది పునీత్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. తాజాగా అగ్ర నటులు చిరంజీవి, వెంకటేశ్‌ పునీత్‌ పార్దివ దేహానికి నివాళుర్పించారు. శనివారం కంఠీరవ స్టేడియానికి చేరుకున్న చిరంజీవి, వెంకటేశ్‌ పునీత్‌ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న శివరాజ్‌కుమార్‌తో మాట్లాడారు. కన్నీటి పర్యంతమవుతున్న ఆయనకు ధైర్యం చెప్పారు. చిరంజీవితో పాటు నటులు శ్రీకాంత్‌, అలీ కూడా పునీత్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు అమెరికాలో ఉన్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కుమార్తె ధ్రుతి బెంగళూరు చేరుకున్నారు.

భగవంతుడు చాలా అన్యాయం చేశాడు: చిరు

‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన అకాల మరణం కలిచివేస్తోంది. భగవంతుడు చాలా అన్యాయం చేశాడు. బెంగళూరు వస్తే పునీత్‌ను కలిసేవాడిని. ఇటీవలే ఆయనను కలిశా. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’’ అని ఈ సందర్భంగా చిరంజీవి అన్నారు. ‘‘మంచి వాళ్లను దేవుడు త్వరగా తీసుకెళ్లిపోతారని విన్నాను. కానీ పునీత్‌ విషయంలో చూశాను. భగవంతుడు నిర్ణయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఒక మంచి మనిషిని, నటుడిని ఇండస్ట్రీ కోల్పోయింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇద్దరం మూడు నెలల కిందట కలిశాం. నన్ను ‘అన్నా’ అని పిలుస్తారు’’ అని అలీ భావోద్వేగానికి గురయ్యారు. మంచి నటుడిని కోల్పోయామని శ్రీకాంత్‌ విచారం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని