Anji: దర్శకత్వం వైపు తీసుకొచ్చింది అదే

‘‘ఛాయాగ్రాహకుడిగా ఇది నాకు 50వ సినిమా. 40 మంది దర్శకులతో కలిసి ప్రయాణం చేశా. వాళ్ల కథల్ని నావైన విజువల్స్‌తో చూడటం అలవాటైంది. ఆ అనుభవమే ఈ సినిమాకి దర్శకత్వం చేయడానికి పనికొచ్చింద’’న్నారు ‘గరుడవేగ’ అంజి. ఛాయాగ్రాహకుడిగా ఆయన తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకి సుపరిచితులు.

Updated : 29 Jun 2022 09:26 IST

‘‘ఛాయాగ్రాహకుడిగా ఇది నాకు 50వ సినిమా. 40 మంది దర్శకులతో కలిసి ప్రయాణం చేశా. వాళ్ల కథల్ని నావైన విజువల్స్‌తో చూడటం అలవాటైంది. ఆ అనుభవమే ఈ సినిమాకి దర్శకత్వం చేయడానికి పనికొచ్చింద’’న్నారు ‘గరుడవేగ’ (Garudavega) అంజి (Anji). ఛాయాగ్రాహకుడిగా ఆయన తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకి సుపరిచితులు. దాసరి నారాయణరావు, రామ్‌గోపాల్‌ వర్మ తదితర దర్శకులతో కలిసి పనిచేశారు. ‘గరుడవేగ’తో ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఇటీవల దర్శకుడిగా మారి ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ (10th Class Diaries) తెరకెక్కించారు. శ్రీరామ్‌(Sriram), అవికాగోర్‌(Avikafgor) కీలక పాత్రలు పోషించిన చిత్రమిది. అచ్యుత రామారావు, పి.రవితేజ మన్యం నిర్మించారు. జులై 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అంజి మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘దర్శకత్వం చేయాలని ఇదివరకెప్పుడూ అనుకోలేదు. ఈ చిత్ర నిర్మాతలతో నేను రెండు సినిమాలకి పనిచేశా. నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావుతో మంచి అనుబంధం ఉంది. ఆయన తన జీవితంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన గురించి తరచూ చెప్పేవారు. అది నన్నెంతగానో కదిలించేది. ఆ కథకి సంబంధించి కొన్ని పనులు చేశాక దీనికి దర్శకత్వంతోపాటు, ఛాయాగ్రాహణం నేనే చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కలిగింది. అలా ఈ సినిమాతో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టా’’.

‘‘పూర్వ విద్యార్థుల కలయికలో చాలా సినిమాలొచ్చాయి. ఇది వాటికి భిన్నంగా సాగే కథ. భావోద్వేగాలతోపాటు.. ఓ చక్కటి డ్రామా ఉంటుంది. అడుగడుగునా ఆసక్తి రేకెత్తిస్తుంటుంది. అది కచ్చితంగా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. స్వతహాగా నేను ఛాయాగ్రాహకుడిని కాబట్టి విజువల్‌గా ఆ ప్రత్యేకత ఉంటుంది. ఈ సినిమాకి మధ్య వయస్కుడైన కథానాయకుడు కావాలనిపించడంతో శ్రీరామ్‌ని ఎంపిక చేశా. మనింట్లో అమ్మాయిలా కనిపించే అవికాగోర్‌ అయితేనే కథానాయిక పాత్రకి బాగుంటుందని తీసుకున్నాం’’.

‘‘మంచి కథ అనిపిస్తే, అది నన్ను ఇదే స్థాయిలో కదిలిస్తే తప్పకుండా దర్శకత్వం చేస్తా. ఛాయాగ్రాహకుడిగా నా ప్రయాణం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈమధ్యే మలయాళంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ తర్వాత జి.నాగేశ్వరరెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ‘బుజ్జి ఇలా రా’ అనే సినిమా చేశా. అదీ త్వరలోనే విడుదలవుతుంది’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని