Chiranjeevi: రామ్‌చరణ్‌ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది

‘వాల్తేరు వీరయ్య’ విజయం సాధిస్తుందని అనుకున్నాం కానీ, నాన్‌ ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల స్థాయికి వెళ్తుందని అసలు ఊహించలేదు.

Updated : 29 Jan 2023 08:31 IST

- చిరంజీవి

‘‘వాల్తేరు వీరయ్య’ విజయం సాధిస్తుందని అనుకున్నాం కానీ, నాన్‌ ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల స్థాయికి వెళ్తుందని అసలు ఊహించలేదు. ఇదంతా ప్రేక్షకుల ఆదరణ వల్లే సాధ్యమైంది. ఇదేమీ ఆషామాషీ విజయం కాదు. ఇప్పటి వరకు దాదాపు రూ.250కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటేనే ఇదెలాంటి విజయమో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు చిరంజీవి. ఆయన.. రవితేజ కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే హన్ముకొండలో శనివారం రాత్రి ‘వీరయ్య విజయ విహారం’ పేరుతో సక్సెస్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీనే. ఆయన తండ్రి తనకు నాపై ఉన్న ప్రేమను ఎలా నూరిపోశాడో.. ఈ చిత్రంతో చూపించాడు. ఈ సినిమాతో బాబీ స్టార్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. తను ఈ చిత్రం తెరకెక్కించిన తీరు చూసి నేనే తనకు అభిమానినైపోయా. రవితేజను చూస్తే నాకు మరో పవన్‌ కల్యాణ్‌లా కనిపిస్తాడు. అందుకే తనపై నాకంత సోదరభావం ఉంటుంది. సినిమాలో తన పాత్ర చనిపోయే సన్నివేశాన్ని పవన్‌ను ఊహించుకొని చేశా. అందుకే ఆ సన్నివేశం అంత భావోద్వేగభరితంగా వచ్చింది. ‘రంగస్థలం’ చూస్తే అందులో రామ్‌చరణ్‌ ఎక్కడా కనిపించడు. చిట్టిబాబు పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుతుంటారు. చరణ్‌కు ఇప్పటికీ జాతీయ అవార్డులు రాకపోవచ్చు కానీ, ప్రతి ఒక్కరూ ఆ చిట్టిబాబు పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారంటే దాని ప్రభావమెంతో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని జాతీయ అవార్డులొస్తే దానికి దీటుగా ఉంటుంది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చరణ్‌ విశ్వరూపం చూపించాడు. అలాగే ఎన్టీఆర్‌ కూడా. వీళ్లూ.. కీరవాణి, చంద్రబోస్‌, ప్రేమ్‌ రక్షిత్‌, రాజమౌళి అందరూ కలిసి చేసిన ‘నాటు నాటు’ పాట ఈరోజున గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడమే కాక.. ఇప్పుడు ఆస్కార్‌ నామినేషన్‌ దాకా వెళ్లిందంటే ఇంత కంటే గర్వకారణం మన తెలుగు వాళ్లకు ఏముంటుంది. నిజంగా చరణ్‌ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా అనిపిస్తోంది. దేశానికి గర్వకారణమైన విషయమిది’’ అన్నారు.

* తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి కుటుంబంతో నాకు 30ఏళ్ల అనుబంధం ఉంది. నేను ఆయన్ని, రామ్‌చరణ్‌ను కోరేది ఒకటే.. వరంగల్‌లో ఒక స్టూడియో పెట్టాలి. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అన్నారు.

* దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘‘ఇంత పెద్ద విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. మా చిత్ర బృందం తరపున ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ చిత్రం విజయం సాధించాక ఇదెన్ని వందల కోట్లు సాధిస్తుందో నేను ఊహించలేదు. కానీ, ఇరవై రోజుల ముందే చిరంజీవి ఇచ్చిన జడ్జిమెంట్‌తో ఇదెంత బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందో అర్థమైపోయింది. మా నాన్న కాలం చేయడానికి నాలుగు నెలల ముందు చిరంజీవి ఆయన్ని ఇంటికి పిలిపించారు. ఈరోజు సాధించిన ఫలితాన్ని ఆరోజే ఊహించి నాన్నకు చెప్పి, ఆయన్ని సంతృప్తిగా పంపించారు. నిజానికి అప్పటికి 30శాతం చిత్రీకరణే పూర్తయింది. నేనిప్పటి వరకు నాలుగు సినిమాలు చేశాను. కానీ, ఈ చిత్ర విజయంతో అందుకుంటున్న గొప్ప గౌరవాన్ని ఎప్పుడూ పొందలేద’’న్నారు. ఈ కార్యక్రమంలో నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌, బివిఎస్‌ రవి, కోన వెంకట్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రవీణ్‌, షకలక శంకర్‌, రవి తదితరులు పాల్గొన్నారు.


హీరో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘మైత్రీ మూవీస్‌ సంస్థ నాకు ‘రంగస్థలం’ లాంటి అద్భుతమైన విజయాన్నిచ్చింది. ఇప్పుడు నాన్నకు ‘వాల్తేరు వీరయ్య’లాంటి మర్చిపోలేని విజయాన్ని అందించింది. బాబీ ప్రతి ఫ్రేమ్‌ను చెక్కినట్లుగా ఈ సినిమాని తెరకెక్కించారు. అంత అద్భుతంగా ఉంది. మా నాన్న నాకు తమ్ముడిలా కనిపించారు. ఏ ముహూర్తాన పూనకాలు లోడింగ్‌ అని పెట్టారో కానీ.. వసూళ్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. రవితేజతో ఓ సీరియస్‌ పాత్ర చేయించి.. దాన్ని కూడా మేము ఎంజాయ్‌ చేసేలా చేశారు బాబీ. సినిమా పూర్తయ్యాక కూడా రవితేజని ఇంకా చూడాలనిపించింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతమందించారు. ఇంత మధురమైన విజయాన్ని అందించిన చిత్ర బృందం మొత్తానికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు. నాన్న చాలా సౌమ్యంగా ఉంటారని అందరూ అంటుంటారు. ఆయన అలా ఉన్నారు కాబట్టే ఈరోజున ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు. నిజంగా ఆయన కొంచెం బిగించి.. కాస్త గట్టిగా మాట్లాడితే ఏం జరుగుతుందో ఇతరులకు తెలియదు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే.. ఆయన మౌనంగా ఉంటారేమో కానీ, వెనకున్న మేము మౌనంగా ఉండం. ఇది మేము చాలా సౌమ్యంగా చెబుతున్న మాట’’ అన్నారు.


 Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని