Anni Manchi Sakunamule: హాయినిచ్చే ఓ మంచి జ్ఞాపకం.. ‘అన్నీ మంచి శకునములే’

‘‘లెక్కలు వేసుకుని చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. సినిమాని మాత్రం ప్యాషన్‌తోనే తీయాలి’’ అంటున్నారు యువ నిర్మాతలు స్వప్నదత్‌, ప్రియాంకదత్‌. అగ్ర నిర్మాత అశ్వినీదత్‌ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ ఇద్దరూ గుర్తుండిపోయే సినిమాల్ని నిర్మిస్తూ, విజయవంతంగా ప్రయాణం చేస్తున్నారు.

Updated : 07 May 2023 14:03 IST

‘‘లెక్కలు వేసుకుని చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. సినిమాని మాత్రం ప్యాషన్‌తోనే తీయాలి’’ అంటున్నారు యువ నిర్మాతలు స్వప్నదత్‌, ప్రియాంకదత్‌. అగ్ర నిర్మాత అశ్వినీదత్‌ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ ఇద్దరూ గుర్తుండిపోయే సినిమాల్ని నిర్మిస్తూ, విజయవంతంగా ప్రయాణం చేస్తున్నారు. మిత్రవిందా మూవీస్‌తో కలిసి స్వప్న సినిమా పతాకంపై ఇటీవల ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule) నిర్మించారు. సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘అన్నీ మంచి శకునములే’ ఎలా ఉంటుంది?

స్వప్న: మితిమీరిన వాణిజ్యాంశాలు, మలుపుల్లాంటివేవీ ఇందులో ఉండవు. వేసవిలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఓ పది రోజులు గడిపి వస్తే ఆ జ్ఞాపకాలు ఎలాంటి హాయిని పంచుతాయో అలాంటి చిత్రమిది. విక్టోరియాపురం అనే ఓ చిన్న టౌన్‌ని సృష్టించి ఆ నేపథ్యంలో ఈ సినిమాని తీసింది నందిని. హీరో హీరోయిన్ల కథ అనడం కంటే, ఇది రెండు కుటుంబాల కథ అని చెప్పాలి.

ప్రియాంక: ఈ సినిమా అంతా కున్నూర్‌ హిల్‌ స్టేషన్‌లోని ఓ ఇంటి నేపథ్యంలో జరుగుతుంది. చిన్నప్పుడు సెలవుల్లో నాన్నతోపాటు ఊటీలాంటి ప్రదేశాలకి వెళ్లేవాళ్లం. ఎప్పటి నుంచో ఆ నేపథ్యంలో ఓ కుటుంబ కథ చేయాలని ఉండేది. నందిని చెప్పిన ఈ కథతో ఆ కోరిక నెరవేరింది.

ఒకవైపు ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్‌ కె’, మరోవైపు పరిమిత వ్యయంతో కూడిన ఈ సినిమా చేయడానికి కారణమేమిటి? బహు భాషల్లో విడుదలే లక్ష్యంగా నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారా? 

స్వప్న: ఒక మంచి కథ అనుకున్నప్పుడు... దాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు సినిమా చిన్నదా, పెద్దదా అనేది పట్టింపు ఉండదు. మా జీవితం మలుపు తీసుకుందే ‘ఎవడే సుబ్రమణ్యం?’ నుంచి. మా జీవితంలో అది పెద్ద సినిమా. మంచి కథ అనుకుని చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. మాకు సహజంగా మూడు నాలుగు సినిమాలు ఒకేసారి తీయడానికి ఇష్టం ఉండదు. ప్రతి సినిమాకీ ఎంతో కొంత లీనమై చేయడం మా శైలి. కానీ ఈసారి మూడు సినిమాలు ఒకేసారి చేయాల్సి వచ్చింది. దానికి కరోనా తదనంతర పరిణామాలే కారణం.

ప్రియాంక: కథకి, పాత్రలకి ఎవరు బాగుంటారో వాళ్లనే ఎంపిక చేసుకున్నాం. అంతే కానీ... వీళ్లైతే తమిళంలో సినిమాకి మేలు జరుగుతుంది, వీళ్లైతే మలయాళంకి బాగుంటుందని నటుల్ని ఎంపిక చేసుకోలేదు. ఒకవేళ తర్వాత డబ్‌ అయితే, అక్కడ మాకు ఈ నటులు బలం అవుతారేమో తెలియదు కానీ... ముందుగా మాత్రం పాత్రలకి తగ్గట్టుగానే నటుల్ని ఎంపిక చేసుకున్నాం. గౌతమి, ఊర్వశి, వాసుకి... వీళ్లంతా ఆయా పాత్రలకి తగ్గట్టు పక్కాగా కుదిరారు. కథానాయకుడు సంతోష్‌ శోభన్‌ అరుదైన నటుడు. ఇందులో రిషి పాత్ర విన్నప్పుడే మాకు సంతోష్‌ శోభన్‌ గుర్తొచ్చాడు. చాలా బాగా నటించాడు. ఈ సినిమాతో తన కెరీర్‌ మారుతుందనే నమ్మకం ఉంది. 

కథల ఎంపికలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎవరు ఎలాంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తుంటారు?

స్వప్న:  ఒకొక్కరూ ఒక్కో కథని బలంగా నమ్ముతుంటాం. నిర్ణయాలు మాత్రం అందరూ కలిసే తీసుకుంటాం. ‘జాతిరత్నాలు’ సినిమాని నాగ్‌ అశ్విన్‌, ప్రియాంక నమ్మినంతగా నేను నమ్మలేదు. తొలి రోజు సినిమా చూస్తూ అందరూ నవ్వుకుంటున్నప్పుడు కూడా నాలో ఒక రకమైన సందేహమే. ఆ సినిమా కోవిడ్‌ సమయంలో విడుదలైంది. విడుదలకి ముందు కూడా ఓటీటీ నుంచి మంచి ఆఫర్‌ వచ్చింది. బ్రహ్మాండమైన ఆఫర్‌ ఇది.. అమ్మేద్దాం అని నేనంటే... నాగ్‌ అశ్విన్‌ ‘మనకు వయసు ఉంది, డబ్బు తర్వాతైనా సంపాదించుకోవచ్చు. ఈ సినిమాకి పోతే అంతా పోతుంది, లేదంటే బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. థియేటర్లలో విడుదల చేద్దాం’ అని చెప్పాడు. ‘సీతారామం’ సినిమాని వాళ్లిద్దరి కంటే నేను ఎక్కువగా నమ్మాను. ఇక ‘మహానటి’ సినిమానైతే మేమందరం ఓ బాధ్యతగా చేశాం. తక్కువ సినిమాలే చేస్తాం. చేస్తున్న ప్రతిదీ మా హృదయానికి దగ్గరగా ఉండాలనుకుంటాం. ఇప్పటిదాకా మాకు నచ్చింది, మేం ముచ్చటపడి చేసిన ప్రతిదీ విజయాన్ని ఇచ్చింది. 80 శాతం ప్రేక్షకుల అభిరుచి మాకు ఉందని నమ్ముతున్నాం. పూర్తిస్థాయి కమర్షియల్‌ మీటర్‌ మాకు తెలియదు కానీ, విభిన్నంగా మంచి అనుభూతిని పంచే కథల్ని ఎంపిక చేసుకుంటున్నాం.

ప్రియాంక: మేం అందరం అన్ని బాధ్యతల్నీ నిర్వర్తిస్తాం. సెట్‌కి వెళతాం, నిర్మాణానంతర కార్యక్రమాలు, మార్కెటింగ్‌ వ్యవహారాలు... ఇలా అన్నీ చూసుకుంటాం. సెట్‌కి వెళ్లి మేం అక్కడ కూర్చుంటేనే చిత్రీకరణ సాగుతుందని కాదు... ఏదైనా జరిగితే వెంటనే నిర్ణయాలు తీసుకోవచ్చు కదా.

స్వప్న: మొదటి సినిమాకి మేం ఒకరినొకరు కొట్టుకున్నాం. తర్వాత కూర్చుని ఓ నిర్ణయానికొచ్చాం. తను కొన్ని పనులు చేస్తుంది, నేను కొన్ని చేస్తాను. తను చేస్తున్నప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే నన్ను అడుగుతుంది. నాకేమైనా అవసరమైతే తనని అడుగుతాను. ఒకరు ఆఫీస్‌లో ఉంటే, మరొకరం సెట్లో ఉంటాం. కథలు, నటుల విషయంలో నాన్న సలహాలూ తీసుకుంటుంటాం.


‘ప్రాజెక్ట్‌ కె’ సంగతులేమిటి? తదుపరి కొత్త సినిమాల కబుర్లేమిటి? 

స్వప్న: ‘ప్రాజెక్ట్‌ కె’కి అన్నీ మంచి శకునములే (నవ్వుతూ). ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి అన్ని వివరాలూ చెబుతాం.

ప్రియాంక: శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడిగా ‘ఛాంపియన్‌’ అనే సినిమా చేస్తున్నాం. అదొక్కటే కొత్తచిత్రం. మా దృష్టంతా భారీ చిత్రమైన ‘ప్రాజెక్ట్‌ కె’పైనే ఉంది. తర్వాతే మిగతా సినిమాల గురించి ఆలోచిస్తాం.


ఇందులో నా పాత్ర స్వప్నదత్‌ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని కథానాయిక మాళవిక నాయర్‌ చెప్పారు. మీరేమంటారు?

స్వప్న: తను అలా చెప్పిందా? తన పాత్ర ఇందులో చాలా కమర్షియల్‌. జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. నేను కూడా ఆచితూచి వ్యాపారం చేస్తుంటాను. ఇవన్నీ మంచి గుణాలే అయితే నేను తనలాగే ఉంటానేమో.

ప్రియాంక: నందిని, స్వప్న పది, పన్నెండేళ్లుగా స్నేహితులు. ఇద్దరూ కలిసి ఎప్పట్నుంచో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రభావంతో నందిని ఆ పాత్రని రాసిందేమో చెప్పలేం (నవ్వుతూ).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు