Pawan Kalyan: సాహిత్యం విలువ తెలుసుకుంటే గొప్ప సినిమాలు చేయొచ్చు

‘‘మాతృభాషలోని బలం... ఆ ప్రదేశం తాలూకూ బలం  సాహిత్యంలోనే దొరుకుతుంది. తెలుగు సాహిత్యం విలువ తెలుసుకుంటే గొప్ప సినిమాలు చేయొచ్చు’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. సాహిత్యంపై పట్టు పెంచుకున్నప్పుడే ఆయా భాషల నుంచి గొప్ప దర్శకులు, స్క్రీన్‌ప్లే రచయితలు వస్తారని చెప్పారు.

Updated : 26 Jul 2023 05:44 IST

‘‘మాతృభాషలోని బలం... ఆ ప్రదేశం తాలూకూ బలం  సాహిత్యంలోనే దొరుకుతుంది. తెలుగు సాహిత్యం విలువ తెలుసుకుంటే గొప్ప సినిమాలు చేయొచ్చు’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. సాహిత్యంపై పట్టు పెంచుకున్నప్పుడే ఆయా భాషల నుంచి గొప్ప దర్శకులు, స్క్రీన్‌ప్లే రచయితలు వస్తారని చెప్పారు. ఆయన తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్‌ రచన చేశారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. యువ కథానాయకులు వరుణ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌, రాజకీయ ప్రముఖుడు టి.జి.వెంకటేశ్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ఇంతటి అభిమానం, ప్రేమ సినిమానే. ఇది నేను కోరుకున్న జీవితం కాదు. అప్పుడప్పుడూ కలా నిజమా అనిపిస్తుంటుంది.  భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం. చిన్న జీవితాన్ని బతకాలనుకున్నా తప్ప నటుడు కావాలని, రాజకీయాల్లో ఉంటాననీ ఊహించలేదు. సమాజం నుంచి తీసుకోవడం కాదు, ఏదైనా ఇవ్వాలనే ఆలోచన ఉన్నవాణ్ని. సముద్రఖని దర్శకత్వంలో సంపూర్ణమైన ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చిన సినిమా ఇది. కరోనా సమయంలో  ప్రముఖ దర్శకుడు, సన్నిహితుడు త్రివిక్రమ్‌ ఈ సినిమా గురించి చెప్పారు. దర్శకులనైనా, కథయినా మనసుకు నచ్చితే నమ్మేస్తాను. మానిటర్‌లో కూడా చూసుకోను. అంతే నమ్మకంతో ఈ సినిమా చేశా.  సముద్రఖని మూల కథకి, త్రివిక్రమ్‌ సరికొత్త స్క్రీన్‌ప్లే అందించారు. పవన్‌కల్యాణ్‌ అభిమానుల కోసం ఏం చేస్తే బాగుంటుందో దృష్టిలో పెట్టుకుని రాశారు. మనలో చాలా మందికి తెలుగు భాష సరిగ్గా పలకడం రాదు. నేను కూడా ఇప్పటికీ సరిదిద్దుకుంటూ ఉంటాను. సముద్రఖనిది మన భాష కాదు, మన యాస కాదు. మొదటిరోజు స్క్రిప్ట్‌ రీడింగ్‌ కోసం వెళితే  తెలుగు స్క్రిప్ట్‌ చదువుతూ ఉన్నారు. ఈ సినిమాకోసం ఏడాదిగా నేర్చుకుంటూ ఉన్నానండీ అన్నారు. తనలా నేనూ తమిళం నేర్చుకుని అక్కడ మాట్లాడతానని మాటిస్తున్నా. తనే మన భాష నేర్చుకున్నాడంటే, తెలుగు మాతృభాష అయ్యుండి తెలుగు నేర్చుకోని మా అందరికీ కనువిప్పులా అనిపించింద’’న్నారు.

సమాజం బాధ్యత : ‘‘సినిమా అంటే ఇష్టం, ప్రేమ ఉంది కానీ సమాజం నాకు బాధ్యత. సినిమా రంగం కానీ, రాజకీయ రంగం కానీ ఏ ఒక్కరిదో కాదు. అందరిదీ. బలంగా అనుకుంటే ఎవరైనా సాధించగలరు. మా అన్నయ్య, మేము సగటు దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినవాళ్లం. చిన్నపాటి ఉద్యోగం చేసి దూరంగా పొలం పని చేసుకోవాలనేది తప్ప నాకు మరొక కోరిక లేదు. అన్నయ్య చిరంజీవి స్టార్‌డమ్‌ సాధించిన తర్వాత నాకు హీరో అంటే ఆయన, కృష్ణగారు గుర్తొచ్చేవారు. నన్ను హీరోగా చేయమని ప్రోత్సహించింది మా వదిన. చిరంజీవి తమ్ముడినని ఏదీ సులభంగా తీసుకోలేదు. కష్టపడి పనిచేశా. మొరటు మనిషిని. నాలోపల చిన్నపాటి రైతు ఉన్నాడు. త్రికరణ శుద్ధితో పనిచేయడమే నన్ను కోట్ల మంది అభిమానుల ముందు నిలబడేలా చేసింది. ‘అందరూ కష్టపడి పనిచేద్దాం, అందరినీ ఆహ్వానిద్దాం’ అని మా కుటుంబ కథానాయకులకీ చెబుతుంటా. ఒక కుటుంబం నుంచి ఇంత మంది వచ్చారంటే ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ మేం గొడ్డు చాకిరీ చేస్తాం. అందరినీ  ఆనందింపజేసే సినిమా కోసం నిరంతరం శ్రమిస్తుంటాం. ఇలా మేమే చేయగలిగినప్పుడు మీరందరూ ఎందుకు చేయలేర’ని అభిమానుల్ని ఉద్దేశించి అన్నారు పవన్‌కల్యాణ్‌.  

ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది: ‘‘సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి నటించా. తనకు నిజ జీవితంలో జరిగిన సంఘటనకీ, ఈ సినిమాకీ దగ్గరి సంబంధం ఉంది. తను ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే స్పందించి అంబులెన్స్‌ని పిలిపించిన అబ్దుల్‌ పర్హాన్‌కి కృతజ్ఞతలు’’ అని చెప్పారు పవన్‌. మన పరిశ్రమలో మనవాళ్లే చేయాలనే ఆలోచనా ధోరణి నుంచి బయటికి రావాలని తమిళ చిత్ర పరిశ్రమని కోరారు పవన్‌కల్యాణ్‌.

సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘పవన్‌కల్యాణ్‌ మావయ్య ఫోన్‌ చేసి ‘ఇలా సినిమా ఒకటి ఉంది, ప్రధానపాత్ర నీదే. నాది అందులో ఓ పాత్ర’ అన్నారు. ఆ మాటతో నేను ఆశ్చర్యపోయా. ఆ తర్వాత ఆయన నన్ను ఏడిపించడానికి అలా చెప్పారని అర్థమైంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు సముద్రఖని. ఈ సినిమా అభిమానులు కాలర్‌ ఎగరేసేలా ఉంటుంద’’న్నారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, ఊర్వశి రౌతేలా, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, ఎ.ఎం.రత్నం, అలీరెజా, నీతాలుల్లా, కాసర్ల శ్యామ్‌, కల్యాణ్‌ చక్రవర్తి, శశి, రోహిణి తదితర చిత్రబృందం పాల్గొంది.


కొత్తతరానికి త్రివిక్రమ్‌ మార్గదర్శి

వన్‌ మాట్లాడుతూ ‘‘దర్శకడు త్రివిక్రమ్‌ స్నేహితుడు అయినందుకు ఆనందిస్తున్నా. చిత్ర పరిశ్రమలో తెలుగు భాషపై మక్కువ కలిగించడం కోసం త్రివిక్రమ్‌ కొత్తతరానికి మార్గనిర్దేశకత్వం చేశారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని యువ రచయితలు రావాలని కోరుకుంటా. రాజమౌళిలాంటి పెద్దలు హాలీవుడ్‌ వరకు తీసుకెళ్లారు. తర్వాత తరం ఆ ప్రయత్నాన్ని  నిరంతరం కొనసాగించాలి. రాజమౌళి.. మహేశ్‌బాబుతో తీసే సినిమా మరో స్థాయికి వెళ్లాలని కోరుకుంటా. చిత్ర పరిశ్రమలో అందరు హీరోలంటే నాకు చాలా ఇష్టం. కథానాయకులు దోపిడీలు చేయరు, ఒకరి వస్తువులు తీసుకోరు. అందరూ కష్టపడతారు. ఒకొక్క హీరో సినిమా చేస్తే సరాసరి 200 మందికి ఉపాధి దొరుకుతుంది.నాకు  చిన్న పెద్ద అనే తేడా ఉండదు. సినిమా చేసేటప్పుడు మాత్రం మిగతావాళ్లకంటే నా సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటాను. ఆ పోటీ లేకపోతే వెనకబడిపోతాం’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని