Bedurulanka 2012: ఆ మాటే నా కథకి స్ఫూర్తి

‘‘ఇటాలియన్‌ సినిమా ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చూశాక దర్శకుడవ్వాలనే లక్ష్యం మొదలైంది’’ అన్నారు క్లాక్స్‌. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా, రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో రూపొందిన ‘బెదురులంక 2012’ చిత్ర దర్శకుడీయన.

Updated : 20 Aug 2023 14:13 IST

‘‘ఇటాలియన్‌ సినిమా ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చూశాక దర్శకుడవ్వాలనే లక్ష్యం మొదలైంది’’ అన్నారు క్లాక్స్‌. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా, రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో రూపొందిన ‘బెదురులంక 2012’ చిత్ర దర్శకుడీయన. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోన్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘మాది భీమవరం దగ్గర ఓ పల్లెటూరు. పరిశ్రమలోకి రావడానికి ముందు సాఫ్ట్‌వేర్‌ మొదలుకొని డీజే వరకు చాలా ఉద్యోగాలు చేశా. నా రూమ్మేట్స్‌ కొందరు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవాళ్లు. ఆ క్రమంలో వాళ్లతో కథల గురించి చర్చించేవాడిని. అలా సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం అలవాటైంది. స్నేహితుడు చరణ్‌ ద్వారా దర్శకుడు సుధీర్‌వర్మ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర ‘స్వామిరారా’కి సహాయ దర్శకుడిగా పనిచేశా. తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ, దేవా కట్టాల శిష్యరికం చేశా’’.

  • ‘‘సినిమా మొదట సైన్స్‌లా అనిపించేది. ఇంతమంది దర్శకులతో ప్రయాణం చేశాక ఓ కళ అని అర్థమైంది. అప్పట్నుంచి సినిమాపై భయం తొలగిపోయి, ఇష్టం ఏర్పడింది. అకిరా కురసోవా ‘సెవెన్‌ సమురాయ్‌’ అంటే నాకు చాలా ఇష్టం. అందులోని ‘రేపు అనేది ఉండదని తెలిసినప్పుడు ఈరోజు సమాజం ఏమనుకుంటుందో మనం పట్టించుకోం’ అనే సంభాషణ స్ఫూర్తితో ‘బెదురులంక 2012’ కథ రాసుకున్నా. నిర్మాత రవీంద్ర, హీరో కార్తికేయలకి నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది’’.
  • ‘‘కల్పితమైన ఓ లంక గ్రామం నేపథ్యంలో సాగే చిత్రమిది. మూఢవిశ్వాసాలపై ఓ వ్యంగ్యాస్త్రంలా, అంతర్లీనంగా ఓ సందేశంతో కూడిన కథతో తెరకెక్కించా. అందుకే ‘బెదురులంక’ అనే పేరు పెట్టాం. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అన్నీ తెలిసిపోతుంటాయి కానీ, పాత్రలకే ఏమీ తెలియదు. అదే ఈ సినిమాలో ప్రత్యేకత, అదే వినోదం పంచే అంశం. కార్తికేయ ఊరిని ఎదిరించే
  • యువకుడిలా కనిపిస్తాడు’’.
  • ‘‘కార్తికేయ, అజయ్‌ ఘోష్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, ఆటో రామ్‌ప్రసాద్‌, నేహాశెట్టి, వెన్నెల కిశోర్‌... ప్రతి ఒక్కరూ పాత్రల్ని అర్థం చేసుకుని ఒదిగిపోయారు. సంగీత దర్శకుడు మణిశర్మ చక్కటి సహకారం అందించారు. కరోనా తర్వాత ప్రేక్షకుల్లో మారిన అభిరుచికి అనుగుణంగా రూపొందిన చిత్రమిది. తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని