రవితేజకు మైలురాయి చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు

‘‘టైగర్‌ నాగేశ్వరరావు’లో ఊహకు అందని కొన్ని విషయాలున్నాయి. ఇందులో పోరాట ఘట్టాల్ని చాలా వాస్తవికంగా తీర్చిదిద్దాం. వాటిని ప్రేక్షకులు నిజమైన పోరాటాలుగా అనుభూతి చెందుతారు’’ అన్నారు ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌.

Published : 03 Oct 2023 04:31 IST

‘‘టైగర్‌ నాగేశ్వరరావు’లో ఊహకు అందని కొన్ని విషయాలున్నాయి. ఇందులో పోరాట ఘట్టాల్ని చాలా వాస్తవికంగా తీర్చిదిద్దాం. వాటిని ప్రేక్షకులు నిజమైన పోరాటాలుగా అనుభూతి చెందుతారు’’ అన్నారు ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌. రవితేజ కథానాయకుడిగా వంశీ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘టైగర్‌ నాగేశ్వరరావు’. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. దీనికి రామ్‌-లక్ష్మణ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానున్న నేపథ్యంలో.. వారిద్దరూ హైదరాబాద్‌లో సోమవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

‘‘ఈ కథ మాకు కొంచెం బాగా దగ్గరగా కనెక్ట్‌ అయ్యింది. ఎందుకంటే మేము స్టువర్టుపురం ప్రాంతంలోనే పుట్టి పెరిగాం. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ గురించి చిన్నప్పుడు ఊర్లో కథలు కథలుగా విన్నాం. ఆయన రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కేవారని, దొంగతనం చేస్తానని చెప్పి మరీ చేసేవారని, చెట్లపై కూడా పరిగెత్తే వారని.. ఇలా చాలా ఊహకందని ఆసక్తికర విషయాలు వినేవాళ్లం. అందరికీ చెప్పి.. దొంగతనం చేసి అక్కడ నుంచి తప్పించుకునే ఓ పాత్రని చూస్తున్నప్పుడు రియల్‌ హీరోయిజం కనిపిస్తుంది. నాగేశ్వరరావు చెన్నై జైలు నుంచి తప్పించుకున్నారు. ఆయనకు టైగర్‌ అనే బిరుదు పోలీసులు ఇచ్చారట. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. మేము ఒక ఫైట్‌ తీసేటప్పుడు రోప్‌ కడతాం. బోలెడు ఏర్పాట్లు చేస్తాం. కానీ, టైగర్‌ నాగేశ్వరరావు ఏ సాయం లేకుండా అంత ఎత్తు జైలు గోడలు ఎలా ఎక్కగలిగారు.. అంత శక్తి ఎక్కడ నుంచి వచ్చిందన్నది ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక దొంగ అంత ప్రాచుర్యం పొందాడంటే దాని వెనుక ఏదోక ప్రత్యేకత ఉంటుంది.

కొత్త అనుభూతినిచ్చింది..

‘‘రవితేజతో మేము ఎన్నో చిత్రాలకు పని చేశాం. కానీ, ఈ సినిమా మాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. టైగర్‌ నాగేశ్వరరావు పాత్రకు రవితేజ చాలా బాగా సరిపోయారు. ఈ కథకు అన్నీ బాగా కుదిరాయి. ఇందులోని ప్రతి యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్రేక్షకులు రియల్‌గా ఫీలవుతారు. వాటిని నాగేశ్వరరావు నివసించిన చీరాల ప్రాంతంలోని జీడి తోటల్లోనే షూట్‌ చేశాం. ఆ ఫైట్స్‌ కోసం రవితేజ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే రైలు యాక్షన్‌ ఎపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంత పవర్‌ఫుల్‌ బయోపిక్‌ తీసిన దర్శకుడు వంశీకి కృతజ్ఞతలు. ఈ సినిమాతో రవితేజ పాన్‌ ఇండియా స్థాయికి వెళ్లనున్నారు. ఆయనకు ఇది ఒక మైలురాయి అవుతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రానికి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాం’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని