Keeravani: ఓ చిత్ర విజయానికి ఆస్కార్‌ ఏమాత్రం పనిచేయదు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ఆస్కార్‌ గెలుచుకొని తెలుగు సినిమా గొప్పతనాన్ని.. భారతీయ చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు సంగీత దర్శకుడు కీరవాణి. అంతటి ఘనత తర్వాత ఇప్పుడాయన సంగీత దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం ‘నా సామిరంగ’.

Updated : 09 Jan 2024 06:51 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ఆస్కార్‌ గెలుచుకొని తెలుగు సినిమా గొప్పతనాన్ని.. భారతీయ చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు సంగీత దర్శకుడు కీరవాణి. అంతటి ఘనత తర్వాత ఇప్పుడాయన సంగీత దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం ‘నా సామిరంగ’. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని కొత్త దర్శకుడు విజయ్‌ బిన్ని తెరకెక్కించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సినిమా  ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో సోమవారం విలేకర్లతో ముచ్చటించారు కీరవాణి.

ఆస్కార్‌ సాధించాక మీపై అంచనాలు రెట్టింపయ్యాయి. దాని ప్రభావం ‘నా సామిరంగ’పై ఎలా ఉండనుంది?

‘‘ఏ సినిమాకైనా హైప్‌ విడుదలయ్యే పాటల ద్వారానే వస్తుంది. అవి జనాలకు ఏమాత్రం ఎక్కినా దానిపై అంచనాలు పెరిగిపోతాయి. అంతేకానీ నాకు ఆస్కార్‌ వచ్చిందనో.. మా ఇంట్లో కుక్కపిల్లకు బంగారు కంకణం తొడిగారనో రాదు. అసలు ఆస్కార్‌ అనేది ఓ చిత్ర విజయానికి కొంచెం కూడా పని చేయదని నమ్ముతా. దర్శకుడు బాగా తీయాలి.. నా పాటలు బాగా కుదరాలి.. అవి జనాలకు బాగా ఎక్కాలి.. అంతే’’.

ఈ చిత్ర విషయంలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన అంశాలేంటి?

‘‘నాగార్జునతో పని చేయడం నాకు అలవాటైన విద్య. మా కాంబినేషన్‌ ఎప్పుడూ విజయవంతమవుతూ వచ్చింది. అలాగే కొత్త దర్శకులకు అవకాశమిచ్చినప్పుడు వాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవాలన్న తపనతో పాత దర్శకుల కన్నా చాలా శ్రమ పడతారు. అది క్లిక్‌ అవ్వొచ్చు.. కాకపోవచ్చు అది వేరే విషయం. కానీ, శ్రమ పడటంలో లోటుండదు. కాబట్టి కొత్త వాళ్లతో పని చేసేటప్పుడు అది మనకు అదనపు ఆకర్షణగా.. ఆసక్తి రేకెత్తించే అంశంగా అనిపిస్తుంది. ఇవే ఈ చిత్ర విషయంలో నన్ను ప్రధానంగా ఆకర్షించిన అంశాలు. నేను.. నాగార్జున కలిసి చేసిన ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’ ఎలాంటి విజయాన్ని అందుకుందో.. ఇదీ అలాంటి ఫలితాన్నే అందుకుంటుందని నా నమ్మకం. ఎందుకంటే ఇదీ దానిలాగే గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా. దాంట్లో ఎన్ని రకాల మసాలాలు ఉన్నాయో దీంట్లోనూ అన్ని ఉన్నాయి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’.

ఇది విజయవంతమైన ఓ మలయాళ చిత్రానికి రీమేక్‌ కదా. దీన్ని ఎంత భిన్నంగా మలిచారు?

‘‘అప్పట్లో రాఘవేంద్రరావు రూపొందించిన ‘సుందరకాండ’ సినిమా కూడా ఓ తమిళ చిత్రానికి రీమేకే. కానీ, దాన్ని ఆయన తెరకెక్కించిన తీరు.. నేనిచ్చిన పాటలు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ‘నా సామిరంగ’ కూడా అలాగే మాతృకకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది మన తెలుగు వాతావరణం,  సంక్రాంతి పండగ, సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ప్రధాన కథాంశంలోనూ చాలా మార్పులు చేశారు. నా సంగీతం కూడా చాలా తాజాగా ఉంటుంది. దర్శకుడిగా విజయ్‌కు ఇది తొలి చిత్రమైనా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చాలా త్వరితగతిన పూర్తి చేశాడు. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విద్య. అలాగే స్వతహాగా తను కొరియోగ్రాఫర్‌ అయినా డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఉన్న పాటల కోసం తాపత్రయపడకుండా దానికి భిన్నంగా నాతో రెండు మంచి మెలోడీ గీతాలు చేయించుకున్నాడు. అది గొప్పతనం. దర్శకుడిగా తనలో ఉన్న పరిణతికి నిదర్శనం’’.

ఈ చిత్రానికి చంద్రబోస్‌ సింగిల్‌ కార్డు అన్నారు. కానీ, దీంట్లో ‘స్నేహం’ నేపథ్యంలో మీరొక పాట రాశారు. ఎందుకని?

‘‘మనం అన్నం తింటున్నప్పుడు పచ్చడి నంచుకుంటుంటాం. అలాగని పచ్చడి తిన్నామని ప్రత్యేకంగా చెప్పం కదా. ఈ చిత్ర విషయంలో చంద్రబోస్‌ అన్నం అయితే నేను పచ్చడిలాంటోడ్ని. నిజానికి నేను ప్రొఫెషనల్‌ రైటర్‌ను కాదు. కాకపోతే కొన్నిసార్లు పాట తనంతట తానుగా మదిలో మెదిలితే వెంటనే దాన్ని రాసే ప్రయత్నం చేస్తా. అంతేకానీ ఎవరైనా వచ్చి మా సినిమాకి ఓ పాట రాసిపెట్టమని అడిగితే రాయలేను. ఈ సినిమాలోని స్నేహం నేపథ్యంలో వచ్చే పాట ముందుగా స్క్రిప్ట్‌లో లేదు. రీరికార్డింగ్‌ టైమ్‌లో పాట ఉంటే బాగుంటుందనిపించి నేనే రాశా’’.

ప్రస్తుతం ఓ పాట ఎంత వైరల్‌ అయిందన్నదే దాని విజయానికి కొలమానం అయిపోయింది. దీన్ని మీరెలా చూస్తారు?

‘‘పాట వైరల్‌ అవ్వడం అనేది మన చేతిలో లేదు. ఒకప్పుడు పాట హిట్‌ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే.. వివాహ వేడుకల్లో బ్యాండ్‌ వాళ్లు ఆ పాట ప్లే చేస్తున్నారా? లేదా? అన్నదాని బట్టి తెలుసుకునే వాళ్లం. ఇప్పుడు వ్యూస్‌ బట్టి తెలుస్తోంది. నేను చెప్పేది ఒకటే.. నిజాయతీగా పని చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది. అది వైరల్‌ అవుతుందా? లేదా? అన్నది దైవాదీనం. ఎవరైనా దర్శకుడు ‘వైరల్‌ అయ్యే పాట ఇవ్వండి’ అన్నారంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. నాకు తెలిసి ఎవరూ అలా అడగరు’’.

రాజమౌళి - మహేశ్‌ల కొత్త చిత్రం ఎప్పుడు మొదలవుతుంది? సంగీత పనులు ఎంతవరకొచ్చాయి?

‘‘ఆ సినిమా గురించి తెలుసుకోవాలంటే రాజమౌళికి ఫోన్‌ చేసి అడగాలి. తనకు ఫోన్‌ చేస్తే అది స్విచ్చాఫ్‌లో ఉంటోంది (నవ్వుతూ). అంటే ఇంకా వర్క్‌ నా వరకు రాలేదని అర్థం. ఇక ‘హరి హర వీరమల్లు’ చిత్ర విషయానికొస్తే.. ప్రస్తుతానికి మూడు పాటలు రికార్డు చేశాం. చిరంజీవి సినిమా ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. దానికి సంబంధించిన సంగీత పనులు మొదలయ్యాయి’’.  

ఆస్కార్‌ విజయం మీపై ఎలాంటి ప్రభావం చూపించింది?

‘‘ఆస్కార్‌, పద్మశ్రీ ఏదైనా సరే నాపై పాజిటివ్‌గా కానీ, నెగటివ్‌గా గానీ ఏ ప్రభావం చూపించలేదు. వాస్తవానికి ఆస్కార్‌ వస్తే బాగుండన్న ఆలోచనలు నాకెప్పుడూ లేవు. ఎందుకంటే నేను ఏ అవార్డుల్ని గౌరవించను. అలాంటి పరిస్థితుల్లో ‘మీరు ఆస్కార్‌ తీసుకురండ’ని రామోజీరావు అన్నారు. ఆయన లాంటి వ్యక్తి ఆస్కార్‌కు గౌరవమిస్తున్నారంటే దానికో విలువ ఉందనిపించి.. త్రికరణ శుద్ధిగా దాన్ని సాధించేందుకు ఏం చేయాలో అది చేసి సాధించుకొచ్చాం’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని