Meenakshi Chaudhary: బాక్సింగ్‌ శిక్షణలో మీనాక్షి

తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అగ్ర తారలతో జోడీ కడుతూ జోరు చూపిస్తోంది మీనాక్షి చౌదరి.

Updated : 30 Mar 2024 11:53 IST

తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అగ్ర తారలతో జోడీ కడుతూ జోరు చూపిస్తోంది మీనాక్షి చౌదరి. ఇటీవలే ‘గుంటూరు కారం’తో సినీప్రియుల్ని అలరించిన ఆమె.. ప్రస్తుతం తమిళ అగ్ర హీరో విజయ్‌తో ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిప్పుడు ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కాగా.. మీనాక్షి తాజాగా థాయ్‌లాండ్‌లో ముయే థాయ్‌ బాక్సింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. ఈ విషయాల్ని ఆమె స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘ఈ థాయ్‌ ట్రిప్‌ ప్రధాన లక్ష్యం కచ్చితంగా ముయే థాయ్‌ బాక్సింగ్‌ నేర్చుకోవడమే’’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో ఇప్పుడామె ఈ బాక్సింగ్‌ నేర్చుకోవడానికి కారణం విజయ్‌ చిత్రమేనని ప్రచారం ఊపందుకుంది. ఆమె ఈ సినిమాలో యాక్షన్‌ పాత్రలో కనిపించనుందని.. త్వరలో మొదలు కానున్న షెడ్యూల్‌లో తనపై యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారని వార్తలు మొదలయ్యాయి. మరి ఆమె నిజంగానే దీంట్లో యాక్షన్‌ పాత్రలో కనిపిస్తుందా.. లేదా? అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్‌ వచ్చే నెల నుంచి రష్యాలో ప్రారంభం కానుందని సమాచారం. మీనాక్షి ప్రస్తుతం తెలుగులో ‘మట్కా’, ‘లక్కీ భాస్కర్‌’, ‘మెకానిక్‌ రాకీ’ చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని