God Father: ‘గాడ్‌ ఫాదర్‌’ వసూళ్లు.. వారికి సమాధానం చెప్పాలంటే రోజు చాలదు: ఎన్వీ ప్రసాద్‌

‘గాడ్‌ ఫాదర్‌’ వసూళ్ల గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ స్పందించారు. కలెక్షన్ల విషయంలో తామంతా సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు.

Published : 14 Oct 2022 01:39 IST

హైదరాబాద్‌: ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) వసూళ్ల గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ (NV Prasad) స్పందించారు. కలెక్షన్ల విషయంలో తామంతా సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా (Mohan Raja) తెరకెక్కించిన చిత్రమిది. దసరా కానుకగా విడుదలై సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్‌, నటుడు సత్యదేవ్‌ (Satyadev), దర్శకుడు మోహన్‌రాజా, సంగీత దర్శకుడు తమన్‌ (SS Thaman) విలేకరుల సమావేశంలో పాల్గొని, పలు విశేషాలు పంచుకున్నారు.

* మీరే సొంతంగా సినిమాను విడుదల చేయటానికి కారణమేంటి?

ఎన్వీ ప్రసాద్‌: ఈ సినిమా ప్రారంభంలోనే నాకు హిట్‌ కావాలని, దాని కోసం ఎంతైనా చేస్తానని దర్శకుడు మోహన్‌రాజాకు చెప్పా. అనుకున్న ఫలితం వచ్చింది. క్యాష్‌ చేసుకునేందుకు ఈ సినిమాని తీయలేదు. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచీ వర్షం పడుతోంది అయినా మేం ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.

* ‘ఆచార్య’ తర్వాత ఈ సినిమాని తీసుకొస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నారు?

ఎన్వీ ప్రసాద్‌: మేం ‘ఆచార్య’ను దృష్టిలో పెట్టుకోలేదు. చిత్ర పరిశ్రమలో జయపజయాలు సహజం. ఏ విషయంలో ఫెయిల్‌ అయ్యామో విశ్లేషించుకుని ముందుకెళ్లాలి. ఫ్లాప్‌ గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే మన చిత్ర పరిశ్రమ ఇంత అభివృద్ధి చెంది ఉండేది కాదు. 

* మీరు ప్రకటించిన వసూళ్లలో నిజం లేదని ట్రోల్స్‌ వస్తున్నాయి..?

ఎన్వీ ప్రసాద్‌: సోషల్‌ మీడియాలో మాపై మొదటి నుంచీ ట్రోల్స్‌ వస్తున్నాయి. వాటికి సమాధానం చెప్పాలంటే ఈరోజు సరిపోదు. ఈ సినిమాకి ప్రచారం కూడా సరిగా చేయలేదన్నారు. సినిమా విడుదల దగ్గర పడుతున్నా మేం పనిచేస్తూనే ఉన్నాం. మా కష్టం వారికి తెలియదు కదా. మాకొచ్చిన రెవెన్యూకు మేం సంతృప్తిగా ఉన్నాం. ఓవర్సీన్‌లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది.

ఈ సినిమా (లూసీఫర్‌) ఓటీటీలో అందుబాటులో ఉంది. అయినా థియేటర్లలో ప్రదర్శితమవుతుందంటే దానికి కారణం మేం చేసిన మార్పులు. ఓటీటీలో ఉచితంగా లభించే సినిమాను డబ్బులిచ్చి థియేటర్లలో చూశారంటే ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో అర్థమవుతోంది. ఓటీటీలో ఉన్న సినిమాను తెరకెక్కించటమంటే మామాలు విషయం కాదు. అదొక ఛాలెంజ్‌.

* మాతృకలో ఉన్న హీరో సోదరుడి పాత్రను ‘గాడ్‌ ఫాదర్’లో ఎందుకు పెట్టలేదు?

మోహన్‌రాజా: మాతృక సినిమాలో హీరో మోహన్‌లాల్‌ 53 నిమిషాలు మాత్రమే తెరపై కనిపిస్తారు. ఆ వెర్షన్‌కు అది కరెక్ట్‌. కానీ, మన దగ్గర హీరోలకు స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కమర్షియల్‌ కోణంలోనూ దోహదపడుతుంది. ఆ ఉద్దేశంతోనే హీరో సోదరుడి పాత్రను తొలగించి, చిరంజీవి క్యారెక్టర్‌ నిడివి పెంచాం.

* ఈ సినిమాని రీమేక్‌ చేయటం ఎలా అనిపించింది?

మోహన్‌రాజా: నా కెరీర్‌లో నేను తెరకెక్కించిన 10 చిత్రాల్లో 8 రీమేక్‌లు. ‘హనుమాన్‌ జంక్షన్‌’ అనేది మలయాళ సినిమా (తెన్‌కాశీపట్టణం) రీమేక్‌ అని చాలామందికి తెలియదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. రీమేక్‌ల గురించి ముందే తెలియటంతో.. ‘అందరూ చూసిన సినిమాను మళ్లీ ఎందుకు తీస్తున్నారు’ అని చాలామంది కామెంట్‌ చేశారు. దాన్ని సవాలుగా స్వీకరించి ఈ చిత్రాన్ని తీశాం. ‘లూసీఫర్‌’ను నేను కథలా కాదు ఓ ఐడియాలా చూశా. అందులో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే కంటెంట్‌ చాలా ఉంది. మాతృకను క్లాస్‌గా చూపించారు. మనం మాస్‌గా రూపొందించాం. చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని స్క్రీన్‌ప్లే రాశాం.

* తదుపరి ఎవరితో సినిమా చేస్తున్నారు?

మోహన్‌రాజా: దాని గురించి ఇప్పుడు చెప్పలేను. త్వరలో తెలియజేస్తా.

* చిరంజీవికి దీటుగా నటించారన్న ప్రశంసలు అందుకున్నారు. ఆ నటనకు కారణం ఎవరు?

సత్యదేవ్‌: నేను అలా నటించటానికి కారణం చిరంజీవి అన్నయ్య. ఈ సినిమా హిట్‌ అవుతుందని, నేను మరింత ఎక్కువమందికి తెలుస్తానని అన్నయ్య ఎప్పుడో చెప్పారు.

* ఈ సినిమా నేపథ్య సంగీతానికి ఎంత సమయం తీసుకున్నారు?

తమన్‌: 29 రోజుల్లో ఈ సినిమా బీజీఎం పూర్తి చేశా. సినిమా చిత్రీకరణ పూర్తవక ముందు ఓ పాటను రూపొందించా. సినిమా పూర్తయ్యాక మిగిలిన పాటలు కంపోజ్‌ చేశా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని