HER movie review: రివ్యూ: హెచ్‌ఈఆర్‌

HER movie review: రుహానీ శర్మ కీలక పాత్రలో నటించిన ‘హెచ్‌ఈఆర్‌’ ఎలా ఉందంటే?

Updated : 21 Jul 2023 09:21 IST

HER movie review: చిత్రం: హెచ్‌.ఇ.ఆర్‌; న‌టీన‌టులు: రుహానీ శ‌ర్మ‌, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ త‌దిత‌రులు; సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి; ఎడిటింగ్‌: చాణక్య తూరుపు; సంగీతం: పవన్; నిర్మాణం: ర‌ఘు సంకురాత్రి, దీప సంకురాత్రి; ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీధ‌ర్ స్వ‌రాఘ‌వ్‌; సంస్థ‌: డ‌బుల్ అప్ మీడియాస్‌; విడుద‌ల‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డిస్ట్రిబ్యూష‌న్‌; విడుద‌ల తేదీ: 21-07-2023

వ‌చ్చే వారం నుంచి అగ్ర తార‌ల సినిమాలు వ‌రుస‌గా విడుద‌ల కానుండ‌డంతో... చిన్న చిత్రాలు క‌ట్ట క‌ట్టుకుని బాక్సాఫీస్ ముందుకు వ‌చ్చేశాయి. అందులో ఒక‌టి... ‘హెచ్‌.ఇ.ఆర్‌’. రుహానీశ‌ర్మ కీల‌క పాత్ర పోషించిన చిత్ర‌మిది. ‘చి.ల‌.సౌ’ మొద‌లుకొని ప‌లు సినిమాల్లో త‌న న‌ట‌న‌తో మెప్పించిన రుహానీ నాయికా ప్ర‌ధాన‌మైన సినిమా చేయ‌డం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. (HER movie review) మ‌రి ఆ ఆస‌క్తికి త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా?

క‌థేంటంటే: హైద‌రాబాద్ శివార్ల‌లో జంట హ‌త్య‌లు చోటు చేసుకుంటాయి. ఆ హ‌త్య‌ల వెన‌క కార‌ణాల్ని నిగ్గు తేల్చేందుకు ఏసీపీ అర్చ‌నా ప్ర‌సాద్ (రుహానీశ‌ర్మ‌) రంగంలోకి దిగుతుంది.  ప‌లు కోణాల్లో కేస్‌ని ప‌రిశోధిస్తున్న క్ర‌మంలో ఊహించ‌ని మ‌లుపులు. ఇంత‌కీ ఆ హ‌త్య‌ల్ని ఎవ‌రు చేశారు?హంతకుల్ని ప‌ట్టుకునే క్ర‌మంలో అర్చ‌న‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? మ‌రోవైపు ఆమె ఎన్‌.ఐ.ఏ (నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ)లోకి వెళ్లాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంటుంది?(HER movie review) త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎవ‌రెలా చేశారంటే: నేర నేప‌థ్యంలో సాగే ఓ ప‌రిశోధ‌నాత్మ‌క చిత్ర‌మిది. అందుబాటులోకి వ‌చ్చిన అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో చిటికెలోనే నేరాల వెన‌క నిజాల్ని నిగ్గు తేలుస్తున్న జ‌మానా ఇది.  ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ కొన్ని కేసుల్లో చిక్కుముడులు ఎదుర‌వుతుంటాయి. కొంత మంది నేర‌గాళ్లు మ‌రింత తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తూ సాంకేతిక‌త‌కి, పోలీస్ వ్య‌వ‌స్థ‌ల‌కే స‌వాళ్లు విసురుతుంటారు. అలాంటి నేర నేప‌థ్య క‌థ‌లే తెర‌పైకొస్తూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంటాయి.(HER movie review) ఇది కూడా ఆ తాను ముక్కే. ఈ సినిమాలో  నేర‌గాళ్ల వేట‌లో ఉన్న‌ది ఓ యువ పోలీస్ అధికారిణి కావ‌డమే ప్ర‌త్యేక‌త‌. ‘హిట్‌’ ఫ్రాంచైజీ స్ఫూర్తితో రూపొందించిన సినిమాగా అనిపిస్తుంది. జంట హ‌త్య‌లతో మొద‌ల‌య్యే ఈ చిత్రంలో మ‌రో కేస్ కూడా కీల‌కమే. ఆరంభ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడిని నేరుగా క‌థ‌లోకి తీసుకెళ‌తాయి. ఆ త‌ర్వాతే సినిమా గాడి త‌ప్పుతుంది. కేసు ప‌రిశోధ‌న‌లోనే బ‌లం లేదు. బాధితుల కుటుంబ స‌భ్యుల్ని, అనుమానితుల్ని క‌లిసి వివ‌రాలు సేక‌రించే క్ర‌మం సాగ‌దీత‌గా అనిపిస్తుంది. సీసీ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్లు, సెల్‌ఫోన్ సిగ్న‌ళ్లతో నేర‌గాళ్ల‌ని చిటికెలో క‌నిపెడుతున్న ఈ ప‌రిస్థితుల్లో ఓ కేస్‌ని నిగ్గు తేల్చేందుకు  ఇంత హంగామానా అనిపిస్తుంది. (HER movie review) నేర‌గాడి చేతిలో మీరు చూసిన గ‌న్  ఇలాంటిదేనా అంటూ బాధితుల్ని  ఆరా తీసే స‌న్నివేశాల‌తో సినిమా నీర‌సం తెప్పిస్తుంది.  పోనీ నిందితులేమైనా గొప్ప తెలివిని ప్ర‌ద‌ర్శిస్తుంటారా అంటే అదేమీ లేదు. ఇలాంటి నేప‌థ్యంలో... ఇంత‌కుమించిన మ‌లుపుల‌తో ఇదివ‌ర‌కు తెలుగులో చాలా సినిమాలే వ‌చ్చాయి. దాంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ప్ర‌భావం చూపించ‌దు. ఓ పోలీస్ అధికారి ప‌రిశోధిస్తున్న రెండు కేసుల్ని ఒక‌దానితో మ‌రొక‌టి ముడిపెట్టిన విధాన‌మే కాస్త మెప్పిస్తుంది.  

ఎవ‌రెలా చేశారంటే: క‌థానాయిక రుహానీశ‌ర్మ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. పోలీస్ అధికారిణి పాత్ర‌లో ఆమె ఒదిగిపోయిన తీరు సినిమాకి బ‌లాన్నిచ్చింది.  క‌థని త‌న భుజాల‌పై మోయ‌డంలో ఎంతో ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌థ‌మార్ధంలో పాట‌లో వికాస్ వ‌శిష్ట‌తో క‌లిసి ఆమె అందంగా క‌నిపించి మెప్పించింది.  జీవ‌న్‌కుమార్ త‌న‌దైన న‌ట‌న‌తోనూ, త‌న మార్క్ సంభాష‌ణ‌ల‌తోనూ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. ప్ర‌దీప్ రుద్ర మ‌రో పోలీస్ అధికారిగా క‌నిపించారు. (HER movie review) అభిగ్న్య‌, సంజ‌య్ స్వ‌రూప్‌, బెన‌ర్జీ, ర‌వివ‌ర్మ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం, కూర్పు విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని ప్ర‌ద‌ర్శించాయి. నిడివి త‌క్కువ ఉండ‌టం ఈ సినిమాకి క‌లిసొచ్చింది. ద‌ర్శ‌కుడు స్వ‌రాఘ‌వ్ మేకింగ్ మెప్పించినా, ఆయ‌న రాసుకున్న కేసులోనే బ‌లం లేదు. కొన్ని మ‌లుపులున్నా అవి పెద్ద‌గా థ్రిల్‌ని పంచ‌లేవు.  నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉంది.

  • బ‌లాలు
  • + రుహానీ శ‌ర్మ న‌ట‌న
  • + కొన్ని మ‌లుపులు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - క‌థ‌, క‌థ‌నం
  • - కొత్త‌ద‌నం లేని నేప‌థ్యం
  • చివ‌రిగా: హెచ్‌.ఇ.ఆర్‌... ఓ సాదాసీదా కేస్ స్ట‌డీ (HER movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని