Mangalavaaram: ‘మంగళవారం’ కథ విన్నప్పుడు ‘అన్వేషణ’ గుర్తొచ్చింది : దిల్‌రాజు

‘‘అరుంధతి’ సినిమా చూసినప్పుడు ఏదైతే అనుభూతి కలిగిందో.. ‘మంగళవారం’ చూశాక అలాగే అనిపించింది.

Updated : 19 Nov 2023 11:41 IST

‘‘అరుంధతి’ సినిమా చూసినప్పుడు ఏదైతే అనుభూతి కలిగిందో.. ‘మంగళవారం’ చూశాక అలాగే అనిపించింది. ఈ చిత్రం బావుందనడానికి క్లైమాక్స్‌.. అందులోని ట్విస్టులే కారణం’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన హైదరాబాద్‌లో శనివారం జరిగిన ‘మంగళవారం’ చిత్ర సక్సెస్‌మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి తెరకెక్కించిన చిత్రమిది. స్వాతి రెడ్డి గునుపాటి, సురేశ్‌ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘నేను ‘మంగళవారం’ కథ విన్నప్పుడు వంశీ ‘అన్వేషణ’ గుర్తుకొచ్చింది. ఆ సినిమా ఎలా ఎంజాయ్‌ చేశానో.. ఈ కథ విన్నప్పుడు అలా ఎంజాయ్‌ చేశా. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే నైజాం హక్కులు తీసుకున్నా. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ పూర్తిగా దర్శకుడు అజయ్‌దే’’ అన్నారు.
‘‘సినిమా చేయాలనేది నా కల. ఈరోజు ఆ కల నిజం చేసుకొని.. ఇలా సక్సెస్‌ మీట్‌లో కూర్చున్నా. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత స్వాతి రెడ్డి. దర్శకుడు అజయ్‌ భూపతి మాట్లాడుతూ.. ‘‘మంగళవారం’ చూసిన వారంతా ‘ఆర్‌ఎక్స్‌ 100’ కంటే బెస్ట్‌ సినిమా అంటున్నారు. నేపథ్య సంగీతం మనసులోంచి పోవడం లేదని ఓ ప్రేక్షకుడు చెప్పాడు. ‘ఇది టెక్నీషియన్స్‌ మూవీ’ అని ప్రీరిలీజ్‌ వేడుకలోనే చెప్పా. ఈరోజు దాని గురించి.. ట్విస్టుల గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది. అందుకే రస్టిక్‌, రియలిస్టిక్‌ బ్లాక్‌ బస్టర్‌ అని వేశాం.’’ అన్నారు. ‘‘నా జీవితంలో ఎంతో సవాల్‌తో కూడుకున్న పాత్రను ఈ చిత్రంలో అజయ్‌ నాకిచ్చారు. ఒక్క సినిమాతో నా పని అయిపోతుందనుకున్నారు. కానీ, ఈ చిత్రంతో అది తప్పని నిరూపించారు’’ అంది నాయిక పాయల్‌. ఈ కార్యక్రమంలో దాశరథి శివేంద్ర, సురేష్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని