Cinema News: అంతా మనమే... ఇక నా మాటే

శర్వానంద్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. బాలనటుడు  విక్రమ్‌ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు

Updated : 27 Mar 2024 11:43 IST

శర్వానంద్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. బాలనటుడు  విక్రమ్‌ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా సంగీత ప్రచార కార్యక్రమం షురూ అవుతోంది. ‘ఇక నా మాటే...’ అంటూ సాగే  ఈ చిత్రంలోని పాటని ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. కుటుంబ వినోదంతో కూడిన విభిన్నమైన కథా చిత్రమిదని సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: విష్ణు శర్మ, జ్ఞానశేఖర్‌.వి.ఎస్‌, కూర్పు: ప్రవీణ్‌  పూడి, కళ: జానీ షేక్‌. సంభాషణలు: అర్జున్‌ కార్తీక్‌, ఠాగూర్‌, వెంకీ.


ఆస్కార్‌ ఉత్తమ నటుడి కొత్త చిత్రం

 హాలీవుడ్‌ కథానాయకుడు సిలియన్‌ మర్ఫీ గతేడాది విడుదలైన ‘ఓపెన్‌ హైమర్‌’తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో ఆయన నటనతో ఈ ఏడాది ఆస్కార్‌ రేసులో నిలిచి ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడాయన మరో వైవిధ్యమైన కథతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన ‘బ్లడ్‌ రన్స్‌ కోల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్క్‌ ఏ బ్రాడ్లీ రచించిన ‘‘బ్లడ్‌ రన్స్‌ కోల్‌: ది యబ్లోన్స్కీ మర్డర్స్‌ అండ్‌ ది బాటిల్‌ ఫర్‌ ది యునైటెడ్‌ మైన్‌ వర్కర్స్‌ ఆఫ్‌ అమెరికా’ అనే పుస్తకం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. అమెరికన్‌ కార్మిక సంఘాల చరిత్రను మార్చిన కార్మిక సంఘాల ఆర్గనైజర్‌ జోసెఫ్‌ జాక్‌ యబ్లోన్స్కీ హత్య నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జెజ్‌ బటర్‌ వర్త్‌, జాన్‌ హెన్రీ బటర్‌ వర్త్‌ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. జాన్‌ డేవిస్‌, జోర్డాన్‌ డేవిస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘28డేస్‌ లాటర్‌ 2’ కోసం సిద్ధమవుతున్నారు సిలియన్‌ మర్ఫీ.


దుల్కర్‌ కాదు శింబు?

కమల్‌హాసన్‌ - మణిరత్నం కలయికలో రూపొందుతున్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. ఇందులో కనిపించే తారలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. చిత్రీకరణ ఆలస్యం అవుతుండడంతో కాల్షీట్ల సమస్య ఉత్పన్నం అవుతోంది. దాంతో తారాగణం విషయంలో మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నట్టు సమాచారం. ఇందులో యువ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అయితే ఆయన తెలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో  కాల్షీట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి ఉత్పన్నమైనట్టు సమాచారం. ఆ స్థానాన్ని తమిళ కథానాయకుడు శింబుతో భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోని  కీలక పాత్రల కోసం కథానాయకులు జయం రవి, గౌతమ్‌ కార్తీక్‌ ఎంపికైన విషయం తెలిసిందే.


‘క్రిష్‌ 4’ సన్నాహాలు

హృతిక్‌ రోషన్‌ సూపర్‌ హీరోగా నటించిన ‘క్రిష్‌’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. వీటికి సీక్వెల్‌గా 2024 చివర్లో ‘క్రిష్‌ 4’ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ‘మొదటి భాగాలకన్నా ఈ సినిమా మరింత భారీగా, సాహసాలమయంగా ఉంటుంది. సరైన కథ కోసం పలువురు రచయితలతో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. దానికోసం మా క్రియేటివ్‌ బృందం రాత్రింబవళ్లు పని చేస్తోంది. 2024 ఆఖర్లో ఈ ప్రాజెక్టు పూర్వ నిర్మాణ పనులు మొదలవుతాయి. 2025 ప్రథమార్ధంలో చిత్రీకరణని ప్రారంభిస్తాం. దీనికోసం హృతిక్‌ రోషన్‌ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని మంగళవారం దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ సన్నిహితవర్గాలు తెలిపాయి. హృతిక్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని