
పూరి మాట: మనలో మనం మాట్లాడుకుందాం!
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం నిన్నొదిలేస్తే... ఒంటరితనం... నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే.. ఏకాంతం! ఈ మాట చాలా మంది మనకు చెప్పి ఉంటారు. కానీ ఇలాంటి జీవితానికి పనికొచ్చే మాటలు పూరి జగన్నాథ్ నోట వింటే ఓ కిక్ వస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు మనలో మనం మాట్లాడుకోవాలి అని పూరి అంటున్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో ఈ రోజు బూస్టింగ్ డోస్ రిలీజ్ చేశారు. అందులో ఆయనేం చెప్పారో మీరే చదవండి.
‘‘లోన్లీనెస్‌కి, ఎలోన్‌నెస్‌కి చాలా తేడా ఉంది. ఒంటరితనం ఎప్పుడూ ఫీల్ అవ్వొద్దు. నీరసం వస్తుంది... ఏడుపొస్తుంది... మన మీద మనకే నమ్మకం పోతుంది. జీవితంలో ఒకటి రెండుసార్లు నేనూ ఇలానే ఫీల్ అయ్యాను. దాని నుంచి బయటకు రావడం తెలియకపోతే ఇంకా కూరుకుపోతాం. ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు మాత్రం.. ఒంటరిగా ఉండొద్దు. ఫ్రెండ్స్‌తో గడపండి.. హెవీ సౌండ్‌తో మ్యూజిక్ వినండి. వర్కవుట్ చేయండి. ఇకపోతే ఎలోన్‌నెస్ దీనికి పూర్తి వ్యతిరేకం. ఏకాంతం కోసం అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్లిపోనక్కర్లేదు. నీకున్న రిలేషన్స్, ఫ్రెండ్స్, లవ్, హెట్‌రెడ్.. ఇలా అన్నీ పక్కనపెట్టి మీతో మీరు కూర్చోవాలి. మన లైఫ్‌కు కావాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు అప్పుడే తీసుకుందాం. మీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి. రూమ్ తలుపేసేయండి. నిలువెత్తు అద్దం ముందు నిలుచోండి. ఆ అద్దంలో కనిపించే వ్యక్తిని సాంతం చూడండి. వాడి మీద మీకు చిరాకొస్తోందా? లేక ముద్దొస్తున్నాడా? మీకే అర్థమవుతుంది.
ఏది పడితే అది తినేయకుండా... కసరత్తులు చేస్తే బాగుండు అనిపిస్తే.. వాడికి చెప్పండి. ఆ తర్వాత వాడితో కూర్చుని.. కళ్లలో కళ్లు పెట్టి కాసేపు వాణ్నే చూస్తూ ఉండండి. ఇప్పటివరకు ఏం చేశావు అని అద్దంలో కనిపించేవాణ్ని అడగండి. వాడేం సమాధానం చెబుతాడో జాగ్రత్తగా వినండి. కన్విన్సింగ్‌గా లేకపోతే ఒప్పుకోవద్దు. మీకున్న అన్ని అనుమానాలు వాణ్ని అడగండి. వాడి విజన్ ఏంటి.. తర్వాతి పదేళ్ల కోసం వాడి దగ్గర ఏం ప్లాన్స్ ఉన్నాయో అడగండి. లేవు అంటే ఊరుకోవద్దు. పోనీ తర్వాతి ఒక సంవత్సరం కోసం ప్లాన్ చెబుతాడేమో చూడండి. బిక్క మొహం వేస్తే అసలు సమస్య ఏంటో అడగండి. ఆ సమస్యల్ని అధిగమించడానికి వాడి బుర్ర పని చేయబోయే మీరే మంచి సలహా ఇవ్వండి. ఎందుకంటే ఈ భూమి మీదకి మీతో కలసి వచ్చింది వాడే. పోయేటప్పుడు కూడా వాడే కంపెనీ. వాణ్ని కొంచెం మంచి దారిలో పెడదాం. వాడు ఎలాంటోడైనా మనకు తప్పదు కదా. వారానికొకసారి అయినా వాడితో కూర్చోండి. ఇద్దరూ కలసి మంచి మ్యూజిక్ వినండి. అప్పుడప్పుడు అద్దంలో ఉన్న వాడితో గడపండి.. వాణ్ని ప్రేమించండి. అబ్బాయిలే కాదు... అమ్మాయిలు కూడా ఇది చేయాలి. అప్పుడప్పుడు మనతో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే లోన్లీనెస్ భయంకరమైనది. ఎలోన్‌నెస్ జీవితంలో మార్పులు తీసుకొస్తుంది’’
- పూరి జగన్నాథ్ @ మ్యూజింగ్స్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.