Rajinikanth: అమితానందంతో మనసు నిండింది

‘జైలర్‌’తో హిట్టు కొట్టి జోరుమీదున్నారు రజనీకాంత్‌. ఇప్పుడీ జోష్‌లోనే దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ సినిమా కోసం రంగంలోకి దిగారు.

Updated : 26 Oct 2023 14:13 IST

రజనీకాంత్‌

‘జైలర్‌’తో హిట్టు కొట్టి జోరుమీదున్నారు రజనీకాంత్‌. ఇప్పుడీ జోష్‌లోనే దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ సినిమా కోసం రంగంలోకి దిగారు. ఇది రజనీకి 170వ చిత్రం. లైకా ప్రోడక్షన్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను రజనీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘‘నా మార్గదర్శి, అద్భుతమైన వ్యక్తి అమితాబ్‌ బచ్చన్‌తో 33ఏళ్ల తర్వాత కలిసి పని చేస్తున్నాను. ఇన్నేళ్ల తర్వాత ఆయనతో తెర పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అమితానందంతో నా మనసు నిండింది’’ అంటూ రజనీకాంత్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు లెజండరీ హీరోల్ని ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఆనందంగా ఉందని, సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ శక్తిమంతమైన కథతో జ్ఞానవేల్‌ ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుపుతున్నారని సమాచారం. ఇందులో భాగంగా రజనీ, అమితాబ్‌లకు సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. బిగ్‌బి.. రజనీ చివరిగా 1991లో వచ్చిన హిందీ చిత్రం ‘హమ్‌’లో కలిసి సందడి చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమా కోసం చేతులు కలిపారు. ఈ చిత్రంలో వీరిద్దరితో పాటు ఫహద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని