Rathika Rose: రతికా రోజ్‌ ఎలిమినేట్‌.. బద్దలైన యువ హృదయాలు..

బిగ్‌బాస్‌ సీజన్‌-7 (bigg boss season 7) నుంచి రతిక రోజ్‌ ఎలిమినేట్‌ అయింది. రతిక (Rathika Rose) ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించగానే ఆమె ఒక్క సారిగా షాక్‌ అయింది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూనే హౌస్‌ నుంచి వేదికపైకి వచ్చింది.

Published : 02 Oct 2023 02:04 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (bigg boss season 7) నుంచి రతిక రోజ్‌ ఎలిమినేట్‌ అయింది. నాలుగో వారం ప్రియాంక, రతిక రోజ్‌, ప్రిన్స్‌ యావర్‌, శుభశ్రీ, గౌతమ్‌కృష్ణ, టేస్టీ తేజలు నామినేషన్స్‌లో ఉండగా, టేస్టీ తేజ, రతిక మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో చివరిగా రతిక (Rathika Rose) ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించగానే ఆమె ఒక్క సారిగా షాక్‌ అయింది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూనే హౌస్‌ నుంచి వేదికపైకి వచ్చింది. ‘రతిక హౌస్‌ లోపలికి పగిలిన హృదయంతో వెళ్లావు. ఇప్పుడు ఫుల్‌ హార్ట్‌తో వచ్చావా’ అని నాగార్జున ప్రశ్నించగా, ‘లేదు. ఇంత తొందరగా రావాలనిపించలేదు. ఇంకా ఆడితే బాగుండనిపించింది. అంతా కలలా ఉంది’ అంటూ సమాధానం ఇచ్చింది.

ఈ సీజన్‌లో సోషల్‌ మీడియా వేదికగా యువత కాస్త ఎక్కువగా ఫాలో అయిన కంటెస్టెంట్‌లలో రతిక ఒకరు. ఆమె ఎలిమినేషన్‌ను తనే కాదు, ప్రేక్షకులు సైతం ఊహించలేదు. అలాగే, ప్రశాంత్‌, యావర్‌, రతికల మధ్య హౌస్‌లో కాస్త ఆసక్తికరమైన ట్రాకే నడిచింది. అయితే, ఆటలో తనని కిందకు లాగుతుంది కూడా వీళ్లిద్దరేనని రతిక చెప్పడం గమనార్హం. ఆ తర్వాత ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నామినేషన్స్‌ సమయంలో చెప్పిన విషయాన్ని తిప్పి తిప్పి చెప్పటం, హౌస్‌మేట్స్‌ అందరితోనూ వాగ్వాదానికి దిగడంతో ఒక దశలో ప్రేక్షకులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా రతిక పట్ల అసహనం వ్యక్తం చేశారు. ‘ఆట ఆడమ్మా.. మనుషులతో కాదు’ అంటూ స్వయంగా నాగార్జునే రతికకు వార్నింగ్‌ ఇవ్వడం  గమనార్హం.

ఇక బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన రతికకు నాగార్జున ఓ టాస్క్‌ ఇచ్చారు. ‘హౌస్‌లో 10 మంది సభ్యులు ఉన్నారు. ఆరుగురిలో నీకు నచ్చని లక్షణం చెప్పాలి. కనీసం ఒకటి.. అత్యధికంగా మూడు చెప్పొచ్చు’ అని నాగార్జున సూచించారు. రతిక పేర్లు చెప్పిన వాళ్లందరూ కాకరకాయ జ్యూస్‌ తాగాలని చెప్పారు.

  • యావర్‌: కోపం ఎక్కువ. యాటిట్యూడ్‌ చూపిస్తాడు. ప్రతిదానికీ ఆవేశపడకుండా కూల్‌గా అర్థం చేసుకో. తెలుగులో ఎక్కువ మాట్లాడు.
  • శివాజీ: అందరితోనూ మంచిగా ఉండండి. మీరు సహజంగా ఆడుతున్నా, అందరితోనూ సమానంగా ఉండకపోవడం వల్ల ఆ ఫీలింగ్‌ వస్తోంది. అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడండి. 
  • సందీప్‌: సంచాలక్‌గా మంచి నిర్ణయాలు తీసుకుంటావని అనుకుంటున్నా. 
  • శోభాశెట్టి: క్యూట్‌గా రెడీ కావడమే కాదు, ఇంట్లో పనికి కూడా ఎక్కువ సమయం కేటాయించు.
  • తేజ: టాస్క్‌ ఇచ్చిన తర్వాతే కాకుండా కుకింగ్‌, వాషింగ్‌, ఇతర పనులు చెయ్‌.
  • శుభశ్రీ: ఎవరైనా ఏదైనా చెబితే ఆలోచించుకోకుండా చేసేస్తుంది. ఇది మార్చుకుంటే సరిపోతుంది. 

ఈ సీజన్‌లో ఎవరూ ఊహించనివి జరుగుతాయని నాగార్జున హెచ్చరించారు. అనంతరం రతిక పవర్‌ అస్త్ర మెడాలియన్‌ను పగలకొట్టమని సూచించగా, ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ‘నిజంగా పగలకొట్టాలా సర్‌’ అని అనగా, ‘బ్రేక్‌ చేయమ్మా’ అనగా, బాధతోనే మెడాలియన్‌ను బద్దలు కొట్టి, ‘బిగ్‌బాస్‌’కు గుడ్‌ బై చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని