RRR: దుమ్ములేపిన ‘ఆర్ఆర్ఆర్‌’.. భారతీయ చిత్రంగా ఆ ఓటీటీలో సరికొత్త రికార్డు..

ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన ‘RRR’ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ఈ మూవీ రికార్డు

Published : 24 Jun 2022 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన ‘RRR’ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు సాధించినట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) కథానాయకులుగా తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాను అగ్ర దర్శకుడు రాజమౌళి(Raja mouli) తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మే 20 నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకూ 45 మిలియన్‌ అవర్స్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్ట్రీమింగ్‌ అయిందట. అలా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించినట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

స్వాతంత్ర్య విప్లవ పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ పాత్రలతో ఫిక్షనల్‌ స్టోరీగా రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తీర్చిదిద్దారు. అల్లూరిగా రామ్‌చరణ్‌, భీమ్‌గా ఎన్టీఆర్‌ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. రాజమౌళి దర్శకత్వ శైలితో పాటు,  ఎం.ఎం.కీరవాణి సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాట భాషతో సంబంధం లేకుండా ప్రపంచ దేశాల్లో పాపులర్‌ అయింది. అలియాభట్‌, అజయ్‌దేవ్‌గణ్‌, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమాను ఐమ్యాక్స్‌, 3డీ, డాల్బీ సినిమా వెర్షన్‌లోనూ విడుదల చేశారు.  ఇక తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ వెర్షన్‌లు ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా స్ట్రీమ్‌ అవుతున్నాయి.

ఇంతకీ ఆర్‌ఆర్‌ఆర్‌ కథేంటంటే: 1920 నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. అప్ప‌టి బ్రిటిష్ ప్ర‌భుత్వంలో విశాఖ‌ప‌ట్ట‌ణం స‌మీపానికి చెందిన రామ‌రాజు (రామ్‌చ‌ర‌ణ్‌)(Ram charan) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. పై అధికారుల మెప్పు పొంది ప‌దోన్న‌తి పొందాలనేదే అత‌ని ఆశ‌యం. త‌న మ‌ర‌ద‌లు సీత (అలియాభ‌ట్‌)కి ఇచ్చిన మాట నెర‌వేరాలంటే ఆ ల‌క్ష్యం సాధించాల్సిందే. మ‌రోవైపు బ్రిటిష్ గవ‌ర్న‌ర్ స్కాట్ దొర (రే స్టీవెన్‌స‌న్‌) త‌న కుటుంబంతోపాటు ఆదిలాబాద్‌ ప్రాంతాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు, అక్క‌డ గోండు జాతికి చెందిన మ‌ల్లి అనే చిన్నారిని వాళ్ల‌తోపాటే దిల్లీకి తీసుకెళతారు. ఇది అన్యాయమని ఎదిరించిన కుటుంబాన్ని హింసిస్తారు. గోండు జాతికి కాప‌రిలాంటి భీమ్ (ఎన్టీఆర్‌)(NTR) మ‌ల్లిని తీసుకు రావ‌డం కోసం దిల్లీకి ప‌య‌న‌మ‌వుతాడు. మ‌రి శ‌త్రుదుర్భేద్య‌మైన  బ్రిటిష్ కోట‌ని భీమ్ దాటుకుని వెళ్ల‌గ‌లిగాడా?అక్క‌డే పోలీస్ అధికారిగా ప‌నిచేస్తున్న రామ‌రాజుకీ, భీమ్‌కీ మ‌ధ్య ఏం జ‌రిగింది? ఆ ఇద్ద‌రికీ భార‌త స్వాతంత్ర్య పోరాటంతో సంబంధ‌ం ఏంటి?(RRR Movie Review) త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని