Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: స‌ప్త సాగ‌రాలు దాటి - సైడ్ ఎ

Sapta Sagaralu Dhaati Movie Review: రక్షిత్‌శెట్టి, రుక్మిణి వసంత్‌ కీలక పాత్రల్లో నటించిన ‘సప్తసాగరాలు దాటి’ ఎలా ఉందంటే?

Updated : 22 Sep 2023 16:32 IST

Sapta Sagaralu Dhaati Movie Review; చిత్రం: సప్తసాగరాలు దాటి; న‌టీన‌టులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, ప‌విత్ర లోకేశ్‌, అవినాష్‌, అచ్యుత్ కుమార్, శరత్ లోహితాశ్వ, రమేష్ ఇందిర, గోపాలకృష్ణ దేశపాండే త‌దిత‌రులు; సంగీతం: చ‌ర‌ణ్‌రాజ్‌, సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి, ఎడిటింగ్‌: సునీల్ భ‌ర‌ద్వాజ్‌, హేమంత్ ఎమ్‌.రావు; నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్,  రచన, దర్శకత్వం: హేమంత్ ఎం రావు; బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ; విడుద‌ల‌: 22-09-2023

‘కేజీయఫ్‌’, ‘కాంతార‌’ సినిమాల త‌ర్వాత క‌న్న‌డ నుంచి వ‌చ్చే సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేకమైన ఆస‌క్తి, అంచ‌నాలు క‌నిపిస్తున్నాయి. క‌న్న‌డ హీరో ర‌క్షిత్‌శెట్టి ఒక‌వైపు మాస్ సినిమాలు చేస్తూనే.. మ‌ధ్య‌లో ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తోనూ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంటారు. ఆయ‌న ఈసారి ఓ ప్రేమ‌క‌థ‌ని ఎంచుకుని ‘స‌ప్త‌సాగ‌ర‌దాచే ఎల్లో’ అనే సినిమా చేశారు. క‌వితాత్మ‌క‌మైన ఈ సినిమా తెలుగులో ‘స‌ప్త సాగ‌రాలు దాటి’ (Sapta Sagaralu Dhaati Movie Review) పేరుతో విడుద‌లైంది.  మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? ఈ మూవీ పంచిన ఫీల్‌ ఏంటి?

క‌థేంటంటే: మ‌ను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వ‌సంత్‌) ఓ ప్రేమ‌జంట‌. శంక‌ర్ గౌడ (అవినాష్‌) అనే పారిశ్రామిక వేత్త ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు మ‌ను. ఒక‌వైపు చ‌దువుకుంటూనే మ‌రోవైపు గాయ‌ని కావాల‌ని ఆ ప్ర‌య‌త్నాల్లో ఉంటుంది ప్రియ‌. మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన ఈ జంట భ‌విష్య‌త్తు గురించి అంద‌మైన క‌ల‌లు కంటూ... పెళ్లి చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంటుంది. తొంద‌ర‌గా జీవితంలో స్థిర‌ప‌డి పోవ‌చ్చ‌నే ఆశ‌తో చేయ‌ని త‌ప్పుని త‌నపైన వేసుకుంటాడు మ‌ను. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?క‌ల‌లు క‌న్నంత అందంగా ఈ ప్రేమజంట భ‌విష్య‌త్తుని తీర్చిదిద్దుకుందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:  ప్రేమ‌లో ప‌డిన  ఓ జంట ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. అంద‌మైన క‌ల‌లు క‌న్న ఆ జంట ప్ర‌యాణాన్ని విధి ఎలా ప్ర‌భావితం చేసింది? ఆ క్ర‌మంలో ఆ జంట ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ని ఎదుర్కొంద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. థియేట‌ర్ నుంచి బ‌య‌టికొచ్చాక కూడా ఆ పాత్ర‌ల తాలూకు భావోద్వేగాలు వెంటాడేలా ప్ర‌భావం చూపించే సినిమాలు అరుదు. అలాంటి చిత్రాల్లో ఇదొక‌టి.  ఓ జంట ప్ర‌యాణాన్ని క‌వితాత్మ‌కంగా తెర‌పై ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు హేమంత్‌. నేరుగా ప్రేమ‌జంట ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు... త‌ర్వాత ఆ రెండు పాత్ర‌ల‌తో వాళ్ల‌దైన ప్ర‌పంచాన్ని తెర‌పై ఆవిష్క‌రించాడు. స‌ముద్రంతో ముడిపెడుతూ ఈ క‌థ‌ని చెప్పాడు. స‌ముద్రంలోని ప్ర‌శాంత‌త‌, క‌ల్లోలాలు రెండూ ఈ క‌థ‌లో ఆవిష్కృతమవుతాయి. (Sapta Sagaralu Dhaati Movie Review) ప్రేమ‌జంట మ‌ధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాలే ఈ సినిమాకి కీల‌కం. ప్ర‌థ‌మార్ధంలో మ‌లుపులు ఆక‌ట్టుకుంటాయి.

ద్వితీయార్ధంలో సంఘ‌ర్ష‌ణ ప‌తాక స్థాయిలో ఉంటుంది. ఎక్కువ భాగం స‌న్నివేశాలు జైలు, కోర్ట్ నేప‌థ్యంలోనే సాగుతుంటాయి.  అనుభూతితో కూడిన ఇలాంటి సినిమాలు ఓపిక‌తో చూడాల్సి ఉంటుంది. ప్ర‌త్యేక‌మైన  ప్ర‌పంచంలో సాగుతున్న క‌థ‌గా అనిపించే ఈ సినిమా చాలా స‌న్నివేశాలు నిదానంగా సాగుతుంటాయి. ద్వితీయార్ధం మ‌రీ భారంగా అనిపించ‌డంతోపాటు, క‌థ కూడా ఏమాత్రం ముందుకు సాగుతున్న‌ట్టు అనిపించ‌దు. రెండోభాగం కోసం క‌థ‌ని అట్టి పెట్టుకున్న ఫ‌లిత‌మే అది. మ‌ను, ప్రియల పూర్తి క‌థ‌ని చూడాలంటే సైడ్-బి పేరుతో విడుద‌ల‌య్యే రెండో భాగం సినిమా వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

ఎవ‌రెలా చేశారంటే: ర‌క్షిత్‌శెట్టి, రుక్మిణీ వ‌సంత్ పాత్ర‌ల‌కి ప్రాణం పోశారు. ఇద్ద‌రి జోడీ, వాళ్ల మ‌ధ్య కెమిస్ట్రీ  ఆక‌ట్టుకుంటుంది. (Sapta Sagaralu Dhaati Movie Review) ర‌క్షిత్ శెట్టి  సునిశిత‌మైన న‌ట‌న‌తోనే భావోద్వేగాలు పండించాడు.  చిరున‌వ్వుతోనే స‌న్నివేశాల‌కి క‌ళ తీసుకొచ్చింది రుక్మిణీ వ‌సంత్. త‌న ప్రియుడి కోసం ధైర్యంగా పోరాడే యువ‌తిగా రుక్మిణి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. రక్షిత్‌శెట్టి  న‌ట‌న ద్వితీయార్ధంలో మ‌రో స్థాయిలో ఉంటుంది. ప‌విత్ర లోకేశ్ క‌థానాయిక త‌ల్లిగా క‌నిపిస్తారు. అచ్యుత్ కుమార్, శరత్ లోహితాశ్వ, రమేష్ ఇందిర, గోపాలకృష్ణ దేశ్‌పాండే త‌దిత‌రులు పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. చరణ్ రాజ్ సంగీతం, అద్వైత గురుమూర్తి కెమెరా ప‌నిత‌నం సినిమాకి ప్ర‌ధాన బ‌లం. ప్రేమ‌క‌థ‌కి త‌గ్గ మూడ్‌ని సృష్టించ‌డంలో వంద‌శాతం విజ‌య‌వంత‌మ‌య్యారు. ద‌ర్శ‌కుడు హేమంత్ వాణిజ్యాంశాల జోలికి వెళ్ల‌కుండా నిజాయ‌తీగా క‌థ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. జైలులో సంభాష‌ణ‌లు, స‌న్నివేశాలు  ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + క‌థ.. భావోద్వేగాలు  
  • + ర‌క్షిత్‌, రుక్మిణి వ‌సంత్ న‌ట‌న  
  • + సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - నెమ్మ‌దిగా సాగే స‌న్నివేశాలు
  • చివ‌రిగా: స‌ప్త సాగ‌రాలు దాటి... క‌దిలించే ప్రేమ‌క‌థ‌. (Sapta Sagaralu Dhaati Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని