Reel rewind 2023: బాక్సాఫీస్‌ చెంత ఎవరి మెరుపెంత?

బడా హీరోల చిత్రాలు చిత్రసీమకు కీలకమైనా.. ఆ సందడి కొన్ని సీజన్లకే పరిమితం. మిగతా ఏడాది మొత్తం బాక్సాఫీస్‌ను నడిపించేది చిన్న, మీడియం రేంజ్‌ స్టార్ల సినిమాలే.

Updated : 12 Dec 2023 09:24 IST

బడా హీరోల చిత్రాలు చిత్రసీమకు కీలకమైనా.. ఆ సందడి కొన్ని సీజన్లకే పరిమితం. మిగతా ఏడాది మొత్తం బాక్సాఫీస్‌ను నడిపించేది చిన్న, మీడియం రేంజ్‌ స్టార్ల సినిమాలే. గతేడాదిలాగే 2023లోనూ వీరి ఆధిపత్యమే బలంగా కనిపించింది. ఒకరిద్దరు మినహా ఈ ఏడాది యువ స్టార్లంతా వరుస సినిమాలతో థియేటర్లను కళకళలాడించారు. అందులో కొందరు హిట్టు మాటతో మెరుపులు మెరిపిస్తే.. మరికొందరు ఊరించి, ఉసూరుమనిపించారు.

కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ.. కొత్తదనం నిండిన కథలతో సందడి చేయడంలో ముందుంటారు కథానాయకుడు నాని. ఆయనకు ఈ 2023 బాగా కలిసొచ్చింది. తను ఈ ఏడాది ఆరంభంలో ‘దసరా’తో బాక్సాఫీస్‌ ముందు మెరుపులు మెరిపించగా.. ముగింపులో ‘హాయ్‌ నాన్న’తో మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడీ జోష్‌లోనే ‘సరిపోదా శనివారం’తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. రోడ్డు ప్రమాదం వల్ల గతేడాది ఒక్క చిత్రం కూడా విడుదల చేయలేకపోయారు కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌. కానీ, ఈసారి మాత్రం రెండు సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించారు. అందులో వేసవి బరిలో నిలిచిన ‘విరూపాక్ష’ ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక ఆయన తన మేనమామ పవన్‌ కల్యాణ్‌తో కలిసి చేసిన ‘బ్రో’ చిత్రం మెగా అభిమానుల్ని మెప్పించినా.. మిశ్రమ ఫలితాన్నే అందుకుంది. తేజ్‌ ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్‌’ అనే సినిమా చేస్తున్నారు.

నాగచైతన్యకు ఈ ఏడాది ‘కస్టడీ’ రూపంలో వెండితెరపై చేదు ఫలితం దక్కినా.. ‘దూత’ వెబ్‌ సిరీస్‌ రూపంలో ఓటీటీ వేదికగా శుభారంభమే దక్కింది. ఇప్పుడీ విజయోత్సాహంలోనే దర్శకుడు చందూ మొండేటితో కలిసి ‘తండేల్‌’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇది వచ్చే ఏడాది థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. గతేడాది ‘లైగర్‌’తో బాక్సాఫీస్‌ ముందు బోల్తా కొట్టిన విజయ్‌ దేవరకొండ.. ఈ సంవత్సరం ‘ఖుషి’తో ఫర్వాలేదనిపించుకున్నారు. ఆయన.. సమంత కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు మంచి వసూళ్లే రాబట్టింది. విజయ్‌ ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ‘ఫ్యామిలీస్టార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రానుంది.

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో వరుస విజయాలందుకొని సత్తా చాటిన నవీన్‌ పొలిశెట్టి తన జైత్రయాత్రను కొనసాగించారు. ఈ ఏడాది ఆయన అనుష్కతో కలిసి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో థియేటర్లలో సందడి చేయగా.. దానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో ముందుంటారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఆయన ఈ ఏడాది ‘సామజవరగమన’తో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించి.. హిట్టు మాట వినిపించుకున్నారు. ఇక ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత సరైన విజయాలు లేక సతమతమవుతున్న యువ హీరో కార్తికేయకు ఈ ఏడాది ‘బెదురులంక 2012’తో కాస్త ఊరట దక్కింది.

 

ఈ స్టార్లకు కలిసిరాలేదు..

చిన్న, మీడియం రేంజ్‌ స్టార్లలో ఈ ఏడాది చాలా మందికి కలిసి రాలేదు. గోపీచంద్‌, నితిన్‌, కల్యాణ్‌రామ్‌, నాగశౌర్య, వరుణ్‌ తేజ్‌.. ఇలా అనేక మంది మీడియం రేంజ్‌ స్టార్లకు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. గతేడాది ‘బింబిసార’తో హిట్టు కొట్టి జోరు చూపించారు కథానాయకుడు కల్యాణ్‌ రామ్‌. కానీ, ఈ ఏడాది ఆరంభంలో ‘అమిగోస్‌’తో చేదు ఫలితాన్ని రుచి చూశారు. దీంతో ఇప్పుడాయన విజయమే లక్ష్యంగా ‘డెవిల్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ స్పై థ్రిల్లర్‌ ఈనెల 29న థియేటర్లలోకి రానుంది.

గత కొన్నాళ్లుగా సరైన విజయాలు లేక సతమతమవుతున్న గోపీచంద్‌కు ఈ ఏడాది కలిసిరాలేదు. మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ‘రామబాణం’ ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. వేసవి బరిలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’తో బాక్సాఫీస్‌ ముందు బోల్తా కొట్టిన నాగశౌర్య.. ద్వితీయార్ధంలో ‘రంగబలి’తో మరో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇక రామ్‌ ‘స్కంద’తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్నారు. యువ హీరోలు నిఖిల్‌ ‘స్పై’తో, అఖిల్‌ ‘ఏజెంట్‌’తో, సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’తో, విష్వక్‌ సేన్‌ ‘దాస్‌ కా దమ్కీ’తో, వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’తో, సుధీర్‌బాబు ‘హంట్‌’, ‘మామామశ్చీంద్ర’లతో ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచారు.

కిరణ్‌ అబ్బవరంకు ఏడాది ఆరంభంలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో మంచి ఫలితం దక్కినా.. ఆ తర్వాత వచ్చిన ‘మీటర్‌’, ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇక సంతోష్‌ శోభన్‌ నుంచి ఈ ఏడాది ‘కళ్యాణం కమనీయం’, ‘శ్రీదేవి శోభన్‌బాబు’, ‘అన్నీ మంచి శకునములే’, ‘ప్రేమ్‌కుమార్‌’.. ఇలా వరుసగా నాలుగు చిత్రాలొచ్చినప్పటికీ ఏదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని