Sirivennala: సిరివెన్నెల పాడిన తొలి పాట ఇదే... మీరూ వినండి!

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆలపించి తొలి గీతం గురించి ఆయన మాటల్లోనే... 

Updated : 01 Dec 2021 14:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నేటి తరం తెలుగు పాట అంటే ఠక్కున గుర్తొచ్చే వారిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. సినిమా పాటలో తనదైన శైలిలో సాహిత్యాన్ని మేళవించి మెప్పించిన రచయిత ఆయన. సిరివెన్నెల కలం నుంచి వచ్చిన పదాల్ని వేరే గాయకులు ఆలపించడం చూశాం. కానీ ఆయనే రాసి, బాణీ కట్టి ఆలపించిన గీతాలూ ఉన్నాయి. అందులో తొలి గీతం ‘కళ్ళు’ సినిమాలోని ‘తెల్లారింది లెగండోయ్‌...’ పాట. సినిమాల్లో పాటలు రాసే సిరివెన్నెల... అసలు ఎందుకు పాడాల్సి వచ్చిందో తెలుసుకుందామా. 

ప్రముఖ ఛాయాగ్రాహకులు ఎంవీ రఘు దర్శకత్వంలో రూపొందిన సంచలనాత్మక చిత్రం ‘కళ్ళు’. ఈ సినిమాకు దివంగత ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాలందించారు.  సినిమాలో కీలక సమయంలో వచ్చే పాట కోసం సిరివెన్నెల సాహిత్యం సిద్ధం చేసి ఇచ్చారట. ఆ పాటను విన్న ఎస్పీ బాలు... ‘మీరే ఈ పాట పాడండి బాగుంటుంది’ అన్నారట. ఆ మాట విన్న సిరివెన్నెల ‘మీరుండగా నేను పాడటం ఏంటి?’ అని అన్నారట. పాడటానికి తొలుత తటపటాయించిన సిరివెన్నెల... పది సార్లు ప్రాక్టీస్‌ చేసి పాడేశారట. ఆ తర్వాత ఆ పాట ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

‘‘కళ్ళు’ అనే సినిమా సారాంశం అంతా ఉండేలా ఆ పాట రాశాను. నా తమ్ముడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గరకు ఆ పాటను తీసుకెళ్లి వినిపించాను. మొత్తం విన్నాక... ‘ఈ పాటను నువ్వే పాడేయ్‌ తమ్ముడు’ అన్నారు. తొలుత వద్దనుకున్నాను. అయితే అన్నయ్య రిహార్సల్‌, రిహార్సల్‌ అని చెప్పి... నాతో పాట పాడించేశారు. పదిసార్లు రిహార్సల్‌ అయ్యాక... ధైర్యం చేసి టేక్‌ చేద్దామా అని అడిగాను. దానికి అన్నయ్య... ‘నేను టేక్‌ తీసుకున్నాను. ఫర్వాలేదు వచ్చేయ్‌. బాగానే పాడావు’ అని చెప్పారు. ఆ తర్వాత పాట అందించిన విజయం ఎప్పటికీ మరచిపోలేను’’

- సిరివెన్నెల సీతారామశాస్త్రి

అంతటి అద్భుతమైన పాటను సిరివెన్నెల గతంలో ‘ఈటీవీ స్వరాభిషేకం’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆలపించారు. ఆ పాటను దిగువ వీడియోల చూసేయొచ్చు. దాంతోపాటు సినిమాలోని ఒరిజినల్‌ పాటను కూడా చూసేయండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని