Love Story: మా ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగింది: నాగ చైతన్య

దర్శకుడు శేఖర్‌ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని, సినిమా విడుదలతో ఆ ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగిందని నటుడు నాగ చైతన్య అన్నారు.

Published : 29 Sep 2021 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు శేఖర్‌ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని, సినిమా విడుదలతో ఆ ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగిందని నటుడు నాగ చైతన్య అన్నారు. ఆయన హీరోగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరి’. సాయి పల్లవి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది.

నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘నా ప్రతి సినిమా విడుదలైన తొలిరోజు ప్రేక్షకుల స్పందన ఏంటి? క్రిటిక్స్‌ ఏమంటున్నారు?అని తెలుసుకుంటా. వాటినిబట్టి ముందుకెళ్తుంటా. కొవిడ్‌ కారణంగా కొన్నాళ్లు దీనికి దూరమయ్యా. ఈ నెల 24న ‘లవ్‌స్టోరి’ విడుదల కావడంతో ఎంతో ఆనందించాను. థియేటర్‌కి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్‌. దర్శకుడు శేఖర్‌ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. సినిమా విడుదలతో మా ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగింది. ఈ జర్నీని ఆపొద్దు సర్‌!’ అని శేఖర్‌ కమ్ములని కోరారు.


సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘మా తాతయ్యతో కలిసి ‘అన్నమయ్య’ చిత్రాన్ని సుమారు 100 సార్లు చూశా. సుమన్‌, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చే ఓ సన్నివేశం చూసి తాత ఏడుస్తుంటే నేను నవ్వేదాన్ని. ఈ పాత్ర గురించి నటిగా మారిన తర్వాత తెలిసింది. ఓ పాత్ర పోషిస్తే అది ప్రేక్షకుల హృదయంలో ఎప్పటికీ నిలిచిపోవాలనే విషయాన్ని నాగార్జున సర్‌ నుంచే నేర్చుకున్నా. చిత్ర బృందం సమష్టి కృషి వల్లే ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. విజయాన్ని అందించిన ప్రేక్షకులకి ధన్యవాదాలు’ అన్నారు.


శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందోనని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో టెన్షన్‌ పడ్డాను. సున్నితమైన ఈ ప్రేమకథని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే భయం ఉండేది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నా. దాదాపు మూడేళ్లు ఈ కథతో ప్రయాణించా. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి గారు రావడం వల్ల ఈ సినిమాకి ఎక్కువ మందికి చేరింది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటి ఈశ్వరీ రావు, నిర్మాత సురేశ్‌ బాబు,  గాయని మంగ్లీ, గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ తదితరులు పాల్గొన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు